YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అలగనూరు ఆర్తనాదం

అలగనూరు ఆర్తనాదం

అలగనూరు జలాశయంపై రాబందులు వాలాయి. మత్స్యకారులకు ఉపాధినిచ్చే జలాశయం కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోయింది. స్థానికులకు పని చూపించకుండా ఇతర జిల్లాలవారితో చేపలు, రొయ్యలు పట్టించి మత్స్యకారుల కడుపులు కొడుతున్నారు. అధికారుల కనుసన్నల్లో సాగుతున్న దందాలో స్థానికులు తీవ్రంగా నష్టపోతున్నారు. జలాశయంలో రొయ్యల పెంపకానికి ఎలాంటి అనుమతులు లేకున్నా యథేచ్ఛగా రొయ్యల సాగు చేస్తున్నారు.

మిడుతూరు మండలం అలగనూరు జలాశయంలో చేపలు పెంచడం, వాటిని పట్టేందుకు వే ెలాలు నిర్వహించడం మత్స్యశాఖ పరిధిలో ఉంటుంది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే చేపలు వదిలిన మత్స్యయశాఖ అధికారులు వాటికి వేలాలు నిర్వహించడం లేదు. నీటి సంఘం లేనందున వేలాలు నిర్వహించడం లేదని అధికారులు అంటున్నారు. అయినా జలాశయంలో చేపలు, రొయ్యలు వదిలారు. వాటిని ప్రతిరోజూ పట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిత్యం రూ.వేల మత్స్య సంపద తరలిపోతున్నా అధికారులు తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. జలాశయాన్ని కబ్జా చేసిన గుత్తేదారులు యథేచ్ఛగా చేపలు పట్టిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు.

తాగునీటి జలాశయాల్లో రొయ్యల సాగుకు అనుమతి ఉండదు. కానీ, అలగనూరు జలాశయంలో యథేచ్ఛగా రొయ్యల సాగు చేస్తున్నారు. ఇక్కడ రొయ్యల పెంపకానికి ఎలాంటి   అనుమతి లేకున్నా రొయ్య పిల్లలను వేస్తున్నారు. పెద్దయ్యాక వాటిని వేటాడుతున్నారు. దీంతో నీటి కాలుష్యం జరిగి మత్స్యకారులకు అలర్జీ వచ్చి కాళ్లకు పుండ్లు ఏర్పడుతున్నాయి. రొయ్యలు పట్టేందుకు ఎవరికీ అనుమతులు లేవు. అనధికారికంగా చేపలు, రొయ్యలను వేటాడుతూ దళారులు రూ.లక్షలు గడిస్తున్నారు. రొయ్యలు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.500 వరకూ పలుకుతున్నాయి. కాంట్రాక్టర్ కేవలం రూ.100 మాత్రమే మత్స్యకారులకు చెల్లిస్తున్నారు. వారి కష్టాన్ని దోచుకుంటున్నారు.

అలగనూరు జలాశయాన్ని తాగునీరు, చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు నిర్మించారు. కుందూ పరివాహక గ్రామాలతో పాటు కడప జిల్లాకు తాగునీరు అందిస్తున్నారు. వేసవిలో జలాశయం నీరే వారికి ఆధారం కాని జలాశయంలో రొయ్యల సాగు వల్ల నీరు కలుషితమవుతోంది. రొయ్యలను వేటాడేందుకు ప్రతిరోజు ఒక్కో మత్స్యకారుడు నాలుగు కిలోల కొబ్బెరను వాడుతున్నారు. 40 మంది 160 కిలోల కొబ్బెర వాడుతున్నారు. ఇలా నాలుగు నెలల పాటు నెలకు 4,800 కిలోల కొబ్బెరను వినియోగిస్తున్నారు. నాలుగు నెలలకు సుమారు 20 టన్నుల కొబ్బెర వాడుతున్నారు. దీనివల్ల నీరు కలుషితమై నురుగగా మారుతోంది. నీరు కలుషితమవుతోంది. రొయ్యలకు వ్యాధులు అధికంగా వస్తాయి. వాటి నివారణకు రసాయన పురుగు మందులు చల్లుతున్నారు. దీంతో  నీటిలో రసాయనాలు కలిసి కలుషితమవుతున్నాయి. నీటి కాలుష్యం వల్ల మత్స్యకారుల కాళ్లకు పుండ్లు ఏర్పడుతున్నాయి.

3,585 ఎకరాల విస్తీర్ణం ఉన్న అలగనూరు జలాశయంలో  తలముడిపి చెరువు విలీనమైంది. ఈ చెరువుకు నీటి సంఘం యాజమాన్యం ఉంది. చేపలు పట్టేందుకు మత్స్యకారుల సంఘాలు ఉన్నాయి. వీరు మాత్రమే మీనాల వేటకు అర్హులు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ జోక్యం కారణంగా నీటి సంఘం ఏర్పాటు చేయలేదు. మత్స్యకారుల జాబితా గాలిలో కలిసి పోయింది. సంబంధిత శాఖ అధికారుల చేతివాటం, నిర్లక్ష్యం కారణంగా మత్స్యకారులకు న్యాయం చేయాల్సిన వారు రూ.కోట్ల ఆదాయం దళారుల చేతుల్లో పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. మూడేళ్లుగా రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు రూ.5.50 లక్షలకు మత్స్యశాఖ దళారులకు అప్పగిస్తోంది. వారు కృష్ణా జిల్లా నుంచి జాలర్లను పిలిపించి చేపలను వేటాడిస్తున్నారు. వీరు చేపలతోపాటుగా రొయ్యలను వేటాడటంలో ఆరితేరిన వారు. అక్కడి నుంచి 40 కుటుంబాలు వచ్చి స్థానిక జలాశయంలో గుడారాలు వేసుకుని చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వీరు పట్టిన చేపలను రకాలను బట్టి కిలో రూ.30 నుంచి రూ.100లకు దళారులు కొనుగోలు చేస్తున్నారు. రొయ్యలను కిలో రూ.100కు కొంటున్నారు. ఇక్కడ ప్రతి రోజూ వందల కిలోల మేర రొయ్యలు పడుతున్నారు. జలాశయ పరిధిలోని గ్రామాల వారే చేపల వేట సాగించాలి. వారికే పూర్తి హక్కు ఉంటుంది. జలాశయాలపై గుత్తేదారుల పెత్తనం అధికమైంది. దీంతో వారు చెప్పిందే శాసనంగా మారింది. వారికే అధికారులు వంత పాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలగనూరు జలాశయంలో ఇతర జిల్లాల నుంచి మత్స్యకారులను రప్పించి చేపలు, రొయ్యల వేట సాగిస్తున్నారు. దీంతో ఈ జిల్లావాసులు ఉపాధి కోల్పోతున్నారు.

Related Posts