గుంటూరు, అక్టోబరు 3,
రాజకీయాల్లో పొత్తులు.. ఎన్నాళ్లు ఉంటాయో చెప్పలేని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. దేశవ్యాప్తంగాను కొనసాగుతోంది. కేంద్రంలో నరేంద్రమోడీకి ఆరేళ్లుగా మద్దతిస్తున్న శిరోమణి అకాలీదళ్ పార్టీ.. తాజాగా వ్యవసాయ బిల్లు నేపథ్యంలో బంధాన్ని తెంచుకుంది. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి విషయం కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో.. ఎప్పుడు దూరంగా ఉంటారో ఆయనకే తెలియని పరిస్థితి! ఇప్పుడు ఏపీలోనూ పొత్తు పొడిచిన పవన్ పార్టీ జనసేన-బీజేపీల మధ్య అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి.మా పొత్తు ఎప్పటికీ పదిలం అంటూ.. అటు పవన్, ఇటు బీజేపీ రాష్ట్ర చీఫ్.. సోము వీర్రాజులు సంయుక్తంగా ప్రకటించారు. కానీ, క్షేత్రస్థాయిలో ఈ పొత్తును ప్రామాణికంగా తీసుకుని ఇరు పార్టీలు అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. రాజధాని విషయంలో బీజేపీ స్టాండు వేరేగా ఉంది. పవన్ స్టాండ్ వేరేగా ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు ఇరు పార్టీల నాయకులు కలిసే ఉన్నారు. రాజధాని విషయంలో నిర్ణయం రాష్ట్రానిదేనని చెబుతున్న బీజేపీ.. ఒక రాజధాని కావాలా ? మూడు రాజధానులు ఉండాలా ? అనే విషయంలోనూ మౌనం పాటిస్తోంది.దీనిపై బీజేపీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయితే, ఇప్పుడు ఈ పార్టీ మిత్రపక్షంగా ఉన్న జనసేన మాత్రం అమరావతికే జైకొట్టింది. మూడు వద్దని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఏకైక రాజధాని వల్లే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు తాజాగా హైకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది జనసేన. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా తాము ప్రజల అభిప్రాయాలను సేకరించి.. తమ అభిప్రాయంగా చెబుతున్నామని కూడా స్పష్టం చేసింది. దీంతో బీజేపీకి ఇది ఇబ్బందికర పరిణామంగా మారింది.ఇలా అయితే.. పవన్‌తో కష్టమే.. అనుకుంటున్నారు కమల నాథులు . కనీసం అఫిడవిట్‌పై తమతో మాట మాత్రంగా అయినా చెప్పలేదని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. ఈ పరిణామాలు ఇరు పార్టీల మధ్య అంతరాన్ని మరింత పెంచుతాయని చెబుతున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.