తొలి చిత్రం 'గుండెజారి గల్లంతయ్యిందే`తో సెన్సేషనల్ హిట్ సాధించి రెండో చిత్రం 'ఒకలైలాకోసం' వంటి బ్యూటీఫుల్ లవ్‌స్టోరితో కమర్షియల్ హిట్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు విజయ్‌కుమార్ కొండా. ప్రస్తుతం విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించిన చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా.. అక్టోబర్ 1 సాయంత్రం 6గంటలకు తెలుగు ఓటీటీ యాప్ ఆహా ద్వారా విడుదలై యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌కుమార్ కొండా వెబినార్‌లో మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలు..
ఒరేయ్ బుజ్జిగా రెస్పాన్స్ ఎలా ఉంది?
- రెస్పాన్స్ అదిరిపోయింది. ఆహా వారి నుండి కాని మా టీమ్ అందరిని నుండి వస్తోన్న రెస్పాన్స్ పట్ల 200 పర్సెంట్ వెరీమచ్ హ్యాపీగా ఉన్నాను. అలాగే నా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఫోన్ చేసి చాలా కాలం తర్వాత ఒక సినిమా చూస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాం. సినిమా చాలా బాగుంది అని అప్రిషియేట్ చేశారు. ముఖ్యంగా ఫ్రెండ్స్‌తో కాని, ఫ్యామిలీ మెంబర్స్‌తోకాని గ్రూప్‌గా కలిసి కూర్చొని సినిమా చూస్తే పడి పడి నవ్వుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మేం ఆడియన్స్ నుండి ఎక్స్‌పెక్ట్ చేసింది కూడా ఇదే. ముందు నుండి మా సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ అనే చెప్తూ వచ్చాం. ఇప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.
లాక్‌డౌన్ కారణంగా సినిమా విడుదల ఆలస్యమైంది కదా? ఆ పరిస్థితుల్లో మీకెలా అనిపించింది?
- ముందు మార్చి 25న సినిమాను విడుదల చేద్దాం అనుకుని అన్ని సిద్దం చేసుకున్నాం. అయితే కరోనా ప్రభావం స్టార్ట్ కావడంతో మార్చి22 నుండి లాక్‌డౌన్ విధించారు. ఆ సమయంలో కొంత బాధ వేసిన మాట నిజమే. అయితే ఈ లాక్‌డౌన్‌కి ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్, లాక్‌డౌన్ తర్వాత జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా మా సినిమాదే కావడం విశేషం.
బుజ్జిగాడు క్యారెక్టర్‌కి ఇన్స్‌పిరేషన్ ఎవరైనా ఉన్నారా?
- ప్రత్యేకంగా ఇన్స్‌పిరేషన్ అంటూ ఎవరూ లేరు.. కాకపోతే ఈ సినిమాలో ముందు నుండి ఎలాంటి లాజిక్స్ లేకుండా ఫుల్ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ని దించేద్దాం అనుకున్నాం. అలాగే బుజ్జిగాడు క్యారెక్టర్ మన పక్కింటి కుర్రాడిలా అనిపించాలి, సినిమా అంతా నవ్వించగలగాలి. కథ రాసుకున్న తర్వాత రాజ్‌తరుణ్ అయితే పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాడనిపించింది. తనను కలిసి కథ వినిపిస్తే తనకు కూడా బాగా నచ్చడంతో ఈ క్యారెక్టర్ చేయడం జరిగింది. రాజ్ తరుణ్ ఈ క్యారెక్టర్ చేయడం సినిమాకి చాలా ప్లస్ అయింది.
హీరోయిన్ పాత్రకు మాళవికా నాయర్‌నే సెలక్ట్ చేసుకోవడానికి రీజనేంటి?
- ఈ సినిమాలో హీరో పాత్రకు సమానంగా హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. హీరోను బాగా ప్రేమించాలి, గొడవపడాలి.. ఇలా ఎన్నో వేరియేషన్స్ ఆమె పాత్రలో ఉంటాయి. ఇలాంటి పాత్రను చేయాలంటే మంచి ఆర్టిస్ట్ అవసరం. ఎవర్ని తీసుకోవాలి? అని అనుకుంటున్న సమయంలో మాళవికా నాయర్ పేరును యూనిట్ సభ్యులు సూచించారు. మాళవికా ఈ పాత్రకు న్యాయం చేస్తుందనిపించి తీసుకోవడం జరిగింది. తన క్యారెక్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
నిర్మాత రాధా మోహన్ గురించి?
-రాధా మోహన్ గారు ఒక సారి స్క్రిప్ట్ డిస్కర్షన్స్ పూర్తయిన తర్వాత డైరెక్టర్‌కి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. దానివల్ల సినిమా ఔట్ పుట్ చాలా బాగా వస్తుంది. సినిమాకి ఏది అవసరమైతే అది తప్పకుండా సమకూరుస్తారు. ఈ సినిమాకి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కి కూడా మంచి పేరు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది.
ఒక లైలా కోసం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు..?
- నేను ఒక సారి ఒక కథ మీదే వర్క్ చేస్తాను. అలా ఒక హీరోతో కథ అనుకుని కొంత కాలం ట్రావెల్ అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా కుదరలేదు. అలా రెండు మూడు సార్లు జరిగింది. అందుకే కొంత గ్యాప్ వచ్చింది. అయితే నాకు ఓపిక, కసి రెండూ ఎక్కువే కాబట్టి ఆ కథలు ప్రక్కన పెట్టి మరో కథతో రాజ్‌తరుణ్ తో ఈ సినిమా చేశాను.
ఇప్పటికే రాజ్‌తరుణ్‌తో మరో సినిమా ఎనౌన్స్ చేశారు కదా! ఇక నుండి గ్యాప్ రాదని అనుకోవచ్చా?
- ఖచ్చితంగా గ్యాప్ రాదండీ..ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశాం. అన్ని నిబందనలు పాటిస్తూ షూటింగ్ జరుపుతున్నాం. నేను కాని రాజ్ తరుణ్ కాని ఇంతవరకూ టచ్ చేయని ఓ కొత్త జోనర్లో సినిమా ఉంటుంది. మాములుగా సస్పెన్స్ థ్రిల్లర్స్ మనం చాలా చూసి ఉంటాం. అయితే ఈ సినిమా రొమాంటిక్ లవ్ సస్పెన్స్ థ్రిల్లర్. క్షణం, గూఢచారి తరహాలో లవ్, ఎంటర్‌టైన్ మెంట్ ఉంటూనే మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి.
మీ అన్ని సినిమాలకి అనూప్ రూబెన్స్ సంగీతం చేస్తున్నారు..?
- నేను దర్శకత్వం వహించిన గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం, ఒరేయ్ బుజ్జిగా మూడు చిత్రాలకు అనూప్ మ్యూజిక్ చేశారు. అలాగే నేను నెక్ట్స్ రాజ్ తరుణ్ తో చేస్తోన్న చిత్రానికి కూడా అనూప్ సంగీతం అందిస్తున్నారు. నేను అనుకున్న రేంజ్‌లో తను నాకు హెల్ప్ చేయలేక పోయినా, అనుకున్న రేంజ్లో ఔట్‌పుట్ ఇవ్వలేక పోయి ఉంటే వేరే వాళ్ల గురించి ఆలోచించే వాడిని అయితే ప్రతిసారి అనూప్ తన బెస్ట్ ఔట్‌పుట్ ఇస్తున్నాడు అందుకే మా ఇద్దరి జర్నీకంటిన్యూ అవుతుంది.
నిఖిల్ తో కన్నడ, తెలుగు భాషల్లో సినిమా చేస్తున్నారు కదా ఆ సినిమా గురించి చెప్పండి?
- కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిగారి ఆఫీస్ నుండి కాల్ చేసి నిఖిల్ హీరోగా మీతో సినిమా చేద్దామని అనుకుంటున్నాం అని అన్నారు. వేరే స్టేట్ నుండి ఫోన్ చేసి మీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాం అనే సరికి చాలా గర్వంగా అనిపించింది. నేను వెళ్లి కథ చెప్పాను. వాళ్లకు బాగా నచ్చింది. దాంతో నిఖిల్ హీరోగా సినిమా ప్రారంభమైంది. ఇప్పటికే ఫిప్టీ పర్సెంట్ కి పైగా షూటింగ్ పూర్తయ్యింది. బాస్కెట్ బాల్ నేపథ్యంలో సాగే ఒక మంచి లవ్ జర్నీ. నాకు ప్రస్టీజియస్ ప్రాజెక్ట్ అది, తెలుగు, కన్నడతో పాటు పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది.
ఒకే సమయంలో రెండు సినిమాలు చేయడం ఎలా అన్పిస్తోంది?
- గతంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద దర్శకుల విషయంలో ఇలా జరిగేది. మళ్లీ ఇప్పుడు నా లైఫ్ లో జరుగుతున్నందుకు హ్యాపీగా ఉంది.