ఒంగోలు, అక్టోబరు 5,
బీజేపీలో బయట పార్టీ వారిని ఒక పట్టాన నమ్మరు. దానికి చాలా కాలమే పడుతుంది. అలా కాంగ్రెస్ నుంచి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి ఇన్నాళ్లకు బీజేపీలో మంచి రోజులు వచ్చినట్లున్నాయి. ఆమెను ఏకంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిని చేశారు. దీని బట్టి చూస్తూంటే చిన్నమ్మ ఇక పెద్ద ఆశలే పెట్టుకోవచ్చునని కూడా సంకేతాలు ఇచ్చారన్నమాట. ఆమె కోరిక ఏంటంటే రాజ్యసభ సభ్యత్వం పొంది కేంద్రంలో మరో మారు మంత్రిగా పనిచేయాలని. కానీ ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ నుంచి ఫిరాయించి బీజేపె గూటికి చేరాక ఆమెను కాషాయం పట్టి పెద్దగా పట్టించుకోలేదన్న బాధ దగ్గుబాటి కుటుంబానికి ఉండేది.ఏపీలో కోస్తా జిల్లాలపైన బీజేపీ గట్టిగా గురిపెట్టినట్లుగా కనిపిస్తోంది. దానికి నాందిగా సోము వీర్రాజును ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ చేసి ఉత్తర కోస్తాలో కీలక కాపు సామాజికవర్గాన్ని టార్గెట్ చేసింది. ఇపుడు దక్షిణ కోస్తాను దృష్టిలో పెట్టుకుని జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరిని తీసుకున్నారు అనుకోవాలి. కమ్మ సామాజికవర్గం బలంగా ఉన్న క్రిష్ణ, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు వంటి చోట్ల ఎన్టీయార్ వారసులు తనదైన మ్యాజిక్ చేస్తారని బీజేపీ పెద్దలు లెక్కలు వేసుకున్నట్లుగా అనిపిస్తోంది. దాంతో చిన్నమ్మ మీద పెద్ద బాధ్యతలే పెట్టారు.ఏపీలో రాయలసీమను పక్కన పెడితే కూడా అధికారంలోకి రావచ్చు అని చంద్రబాబు 2014 ఎన్నికల ద్వారా నిరూపించారు. 104 సీట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఏపీలో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు. దాంతో బీజేపీ చాలా దూరాలోచనతోనే పురంధేశ్వరికి కీలకమైన బాధ్యతలు అప్పగించారనుకోవాలి. సోము వీర్రాజు ద్వారా కాపులను, పురంధేశ్వరి ద్వారా కమ్మలను చేరదీయాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. నిజానికి టీడీపీ నుంచి చేరిన సుజనా చౌదరి లాంటి వారు బీజేపీలో ఉన్నా కూడా ఎన్టీయార్ లెగసీని తిప్పుకోవడానికే చిన్నమ్మకు ప్రాధాన్యత ఇచ్చారని చెబుతున్నారు.వాస్తవానికి ఇది టీడీపీ ఫార్ములా. 2014లో దీనిని అనుసరించే చంద్రబాబు ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రి కాగలిగారు. కమ్మల ఓట్లతో పాటు కాపులు కూడా టీడీపీని ఆదరించారు. ఈ రెండు సామాజికవర్గాలు ఒక వైపు నిలిచి ఉండడం వల్ల వైసీపీకి పూర్తిగా రాయలసీమలో పూర్తిగా రెడ్లు కొమ్ము కాసినా ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఇక కాపుల మద్దతుకు సోముతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇపుడు జత చేరారు. కాబట్టి బీజేపీ తెలివిగానే అడుగులు వేస్తుందనుకోవాలి. మరి ఏపీ జనాల మనసులను బీజేపీ ఎంతవరకూ గెలుచుకుంటుంది అన్నదే ఇక్కడ చర్చ.