ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తుకు సిద్ధమని ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత పురంధేశ్వరి స్పందించారు. జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ఇప్పుడు తెరపైకి తేవడం విడ్డూరమని ఆమె వ్యాఖ్యానించారు. హోదాతో కలిగే ప్రయోజనాలన్నీ కేంద్రం ఇప్పటికే కల్పిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. ఏపీకి పెద్ద ఎత్తున కేంద్రం నిధులు అందజేస్తోందని పురందేశ్వరి చెప్పారు. జగన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జేడీ శాలం కూడా స్పందించారు. కేసులను సాకుగా చూపి జగన్‌ను బీజేపీ బెదిరించిందని ఆయన చెప్పారు. కేసులకు భయపడే బీజేపీతో కలుస్తానని జగన్ సంకేతం ఇచ్చారని జేడీ శీలం అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నా బీజేపీతో కలుస్తానని జగన్ చెప్పిన మాటల వెనక ఆంతర్యమేంటని ఆయన సందేహం వెలిబుచ్చారు. సీపీఐ నేత రామకృష్ణ కూడా జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. టీడీపీ, వైసీపీ రెండూ ప్రత్యేక హోదా పోరాటాన్ని పక్కన పెట్టాయని ఆయన విమర్శించారు. విభజన బిల్లు ఆమోదమప్పుడు పోరాడకుండా.. ఇప్పుడూ పోరాడకుండా ఉంటే హోదా ఎలా వస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు.