YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

లాలూ పరోక్షంలో జరుగుతున్న ఎన్నిక

లాలూ పరోక్షంలో జరుగుతున్న ఎన్నిక

పాట్నా, అక్టోబ‌రు 5, 
బీహార్ లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా లాలూప్రసాద్ యాదవ్ పేరు చెప్పాల్సి ఉంటుంది. లాలూ బీహార్ లో సంచలనాలను సృష్టించారు. తన సొంత పార్టీని పెట్టి విజయపధాన నడిపించారు. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ లేకుండా తొలిసారి బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం పశుదాణా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన లేకుండా ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్జేడీలో కొంత అలజడి ఉందని చెప్పవచ్చు.లాలూ ప్రసాద్ యాదవ్ 29 ఏళ్ల వయసులోనే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజ్ నారాయణ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. బీహార్ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా మారారు. ఏడేళ్ల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. లాలూను బీహార్ ప్రజలు అంతగా నమ్ముతారు. ఆయన మాటలంటే చెవులు కోసుకుంటారు. ఆయన బహిరంగ సభలకు జనం కిటకిటలాడతారు.2015లో జరిగిన బీహార్ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ మహాగడ్బంధన్ కు నేతృత్వం వహించారు. మోదీ ఇమేజ్ దేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ బీహార్ లో మాత్రం పప్పులుడకవని లాలూ ఫలితాల ద్వారా చెప్పేశారు. గత ఎన్నికల్లో 73 స్థానాలను లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ సాధించినా ఇచ్చిన మాటకు కట్టుబడి 69 స్థానాలు దక్కిన జేడీయూకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. తన కుమారులను మంత్రివర్గంలోకి పంపారు.ఆ తర్వాత లాలూప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల అవినీతి పేరిట నితీష్ కుమార్ బీజేపీ వైపు వెళ్లిపోయారు. ప్రస్తుతం బీహార్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ జైలులోనే ఉన్నారు. అయితే తరచూ ఆయనతో ములాఖత్ అవుతూ సీట్ల సర్దుబాటు, ప్రచారం వంటి వాటిపై సూచనలు తీసుకుంటున్నారు. లాలూ యాదవ్ జైలులో ఉన్నా ఆయన ఆశీస్సులు తమకు ఉన్నాయంటున్నారు ఆర్జేడీ నేతలు. మొత్తం మీద లాలూ పరోక్షంలో జరుగుతున్న ఎన్నికల్లో ఆర్జేడీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందన్నది వేచి చూడాల్సిందే.

Related Posts