హైద్రాబాద్,అక్టోబరు 5,
రానున్న రెండు నెలల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా..? ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తన అధికార విధుల్ని నిర్వహించడం కష్టంగా మారే అవకాశం ఉందా..? ఈ అంశంపై ప్రస్తుతం ఏపీలోనూ, వైసీపీ శ్రేణుల్లో హాట్ హాట్‌గా చర్చ సాగుతుంది. వచ్చే రెండు నెలల్లో ఈ పరిణామాలు ఉండవచ్చనే అంచనాలో వైసీపీ శ్రేణులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు సూచనలు హైకోర్టు కదలికలు ఇప్పుడు జగన్‌కు తలనొప్పిగా మారబోతున్నాయి. అక్రమాస్తుల కేసులను ఎదుర్కొంటున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి రోజువారీ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి రానుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇటీవల సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక నేరాలతోపాటు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిథులపై అభియోగాలను త్వరితగతిన తేల్చాలని నిర్ణయించింది. దీనిపై అమికస్ క్యూరీ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం కూడా స్వాగతించింది. నేతలపై ఉన్న కేసులను త్వరగా తేల్చేసేలా అవసరమైతే ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు, మౌలిక సదుపాయాల కల్పనకు సహాయం కూడా చేస్తామని ప్రకటించింది. దీంతో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల హైకోర్టులకు కీలక సూచనలు చేసింది. నేతలపై ఉన్న కేసుల విచారణ నిర్ధిష్ట కాల వ్యవధిలో ముగిసేలా ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు సూచనలతో తెలంగాణ హైకోర్టు సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సర్క్యిలర్ ఆధారంగా జగన్ కేసులుసైతం రోజువారి విచారణకు రానున్నాయి. జగన్‌పై దాఖలైన కేసులన్నీ తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి.హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషిట్లు దాఖలయ్యాయి. 2012-2014 మధ్య కాలంలో జగన్, తదితరులపై సీబీఐ 11 చార్జిషిట్లు దాఖలు చేసింది. మనీ లాండరింగ్‌కు సంబంధించి ఈడీ ఐదు చార్జిషిట్లు దాఖలు చేసింది. ఇప్పటి వరకు జగన్ తదితరులు వేస్తున్న రకరకాల పిటిషన్లపైనే విచారణ జరుగుతూ వస్తుంది. ప్రతీ శుక్రవారం ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కోర్టుకు విచారణకు హాజరవుతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత అధికారిక పనుల నిమిత్తం బిజీగా ఉండటంతో కోర్టుకు హాజరుపై ఎప్పటికప్పుడు మినహాయింపు పొందుతున్నారు. ఇక జనవరి నుంచి కరోనా కారణంగా కోర్టులో విచారణలు జరగకపోవటంతో హాజరు కావటం లేదు. చివరి సారిగా జగన్ జనవరి 10న కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం హైకోర్టు జారీ చేసిన సర్క్యిలర్‌తో తనపై ఉన్న కేసుల నేపథ్యంలో జగన్మోహన్‌రెడ్డి రోజువారీగా కోర్టులకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. దీంతో ఏపీలో ఈ అంశంపై విస్తృత ప్రచారం సాగుతుంది. రెండు నెలల్లో ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని, జగన్ తన అధికార విధుల్ని నిర్వహించడం కష్టంగా మారొచ్చనే చర్చ సాగుతుంది