న్యూఢిల్లీ,అక్టోబరు 5,
ఒకవైపు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై అఫెక్స్ సమావేశం, మరో వైపు ప్రధాని మోదీతో భేటీ.. ఈ రెండు భేటీలు 6వ తేదీనే జరగనున్నాయి. ఏపీ సీఎం ఈ రెండు భేటీల్లో పాల్గోనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీతో అపాయింట్ మెంట్ 6వ తేదీన ఖరారు కావటంతో జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ జగన్ సమావేశం కానున్నారు. అయితే అదే రోజు అఫెక్స్ కమిటీ సమావేశం ఉండటంతో జగన్ ఆ సమావేశంలో పాల్గొంటారా.. లేదా అనేది సందేహంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మోదీతో ఉదయం భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం ప్రధానితో భేటీ, మధ్యాహ్నం అఫెక్స్ కమిటీ సమావేశంలో జగన్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆ తరువాత మరికొందరు కేంద్ర మంత్రులతోనూ జగన్ భేటీ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 6న ప్రధానితో భేటీ కానున్న జగన్మోహన్‌రెడ్డి పలు కీలక అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని సీఎం జగన్ ప్రధాని మోదీని కోరనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జగన్ భేటీ అయ్యారు. తాజాగా మోదీతో మరోసారి భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలాఉంటే ప్రధాని మోదీతో భేటీకి మరో కారణంకూడా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికితోడు ఆర్థిక నేరస్తుల కేసులు, అక్రమాస్తుల కేసులను రోజువారీవిచారణ చేపట్టి వెంటనే పూర్తి చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టులకు సూచించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆ మేరకు సర్క్యులర్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. జగన్ కేసులు తెలంగాణ హైకోర్టులోనే ఉండటంతో సీఎం జగన్ ప్రతీరోజు కోర్టుకు హాజరయ్యే పరిస్థితి ఏర్పడనుంది. వీటి నుంచి తప్పించుకొనేందుకే జగన్ ప్రధానితో భేటీ అవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు అదే రోజు అఫెక్స్ కమిటీ భేటీ జరగనున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల నదీ జలాల విషయంపై ముందుగా ప్రధానికి జగన్మోహన్‌రెడ్డి వివరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ వాదనను ముందుగానే ప్రధానికి తెలపడం ద్వారా అఫెక్స్ కమిటీలో తెలంగాణ ప్రభుత్వ వాదనలకు బలంలేకుండా చేయవచ్చుననే భావనలో వైసీపీ అధినేత ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఈనెల 6వ తేదీనే రెండు కీలక సమావేశాల్లో ఏపీ సీఎం జగన్ పాల్గొననుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది.