YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

క‌నిపించ‌ని రాముల‌మ్మ‌, అజార్

క‌నిపించ‌ని రాముల‌మ్మ‌, అజార్

హైద్రాబాద్,అక్టోబ‌రు 5, 
తెలంగాణ కాంగ్రెస్‌లో స్టార్ క్యాంపెయినర్లు ఎవరు అంటే విజయశాంతి, అజారుద్దీన్ అనే చెబుతారు. కానీ ఇటీవలి కాలంలో వారు వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోంది. పార్టీ కార్యక్రమాలకు ఇప్పటికే దూరమైన వీరిద్దరూ.. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్‌ నిర్వహించిన సమావేశాలకు గైర్హాజరు అయ్యారు. మర్యాద పూర్వకంగానైనా వీరిద్దరూ కలుస్తారని కాంగ్రెస్ వర్గాలు భావించాయి.. కానీ అది కూడా జరగలేదంటే వారి మనసులో ఏముందో అని తెలంగాణ కాంగ్రెస్ లో భిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ హైదరాబాద్‌లో నియోజకవర్గ స్థాయి నేతల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు సమావేశాలు, సమీక్షలతో బిజీబిజీగా గడిపారు. రాబోయే ఎన్నికల కోసం అభిప్రాయాలు సేకరించి, వ్యూహరచన చేశారు. ఆయన్ను కలవడానికి కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కానీ పార్టీలో క్రియాశీలక స్థానాల్లో ఉన్న విజయశాంతి, అజారుద్దీన్‌లు మాత్రం గాంధీభవన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా, పార్లమెంట్ ఎన్నికలకు ప్రచార కమిటీ ఛైర్ పర్సన్‌గా విజయశాంతిని నియమించగా.. ఆ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆమె  ప్రచారం చేశారు. ఆ తర్వాత నుంచి క్రమంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా మాత్రమే విజయశాంతి స్పందిస్తూ ఉన్నారు. హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారనే కథనాలు గతంలో కూడా వినిపించాయి. వాటిని నిజం చేస్తారో లేదో చూడాలి. ఇక అజారుద్దీన్ ను 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు మైనార్టీలను ఆకర్షించేందుకు ఆయనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చేర్చినప్పటికీ.. చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైన తర్వాత ఆయన ఎక్కువగా టీఆర్ఎస్ నాయకులకు సన్నిహితంగా ఉంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో తరుచూ సమావేశమవుతూ ఉండడంతో అజారుద్దీన్ కారు ఎక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉండగా.. ఇప్పుడు ఇలా పలువురు ప్రముఖ నాయకులు హ్యాండ్ ఇచ్చేస్తారేమోనని టెన్షన్ మొదలైంది. వీరిద్దరి రాజకీయ ప్రయాణం ఎటు వెళుతుందో చూడాలి.

Related Posts