పలు రాష్ట్రాల్లో కరెన్సీ కొరత తీవ్రంగా ఉండటంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సమయంలో తలెత్తిన పరిణామాలను తాజా నోట్ల కొరత మరోసారి గుర్తుచేస్తోందని ఆమె అన్నారు. పలు రాష్ట్రాల్లో ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద నోట్ల జాడైతే తెలియడం లేదు. ఇది కచ్చితంగా డీమోనిటైజేషన్ రోజులను గుర్తు చేస్తోంది. దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ నడుస్తోందా? అని మమత ఓ ట్వీట్‌లో నిలదీశారు.గుజరాత్, తూర్పు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నోట్ల కొరత తీవ్రంగా ఉంది. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. అవసరాని కంటే ఎక్కువగానే కరెన్సీ మార్కెట్లో చెలామణిలో ఉందని, బ్యాంకుల వద్ద కూడా డబ్బులున్నాయని, కొన్ని రాష్ట్రాల్లో తలెత్తిన కరెన్సీ కొరతను మాత్రం సత్వరమే పరిష్కరిస్తామని చెప్పారు. కొన్ని ఏరియాల్లో అసాధారణంగా పెరిగిన కరెన్సీ వినియోగం వల్లే కొరత తలెత్తిందని ఆయన విశ్లేషించారు.టీఎంలలో కరెన్సీ నోట్లు అందుబాటులో లేకపోవడంతో దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మళ్లీ నోట్లరద్దు నాటి పరిస్థితులు తలెత్తడంతో ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాగా ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడడానికి రూ.200 నోట్లు కూడా ఓ కారణమేనని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా వచ్చిన రూ.200 నోట్ల కోసం కొన్నిరాష్ట్రాల్లో ఏటీఎంల కాలిబరైజేషన్ ఇప్పటికీ పూర్తి కాలేదు. హైదరాబాద్, భోపాల్. సూరత్. వారణాసి, పాట్నా, నోయిడా, ఢిల్లీ సహా పలు నగరాల్లో కరెన్సీ నోట్లకు తీవ్ర కొరత ఏర్పడింది.మరోవైపు పనిచేయని ఏటీఎంలను యుద్ధప్రాతికన పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకుల వద్ద ప్రస్తుతం అవసరమైన దానికంటే ఎక్కువగానే కరెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయనీ... కొన్ని ప్రాంతాల్లో అనూహ్యంగా డిమాండ్ పెరగడం వల్లే కరెన్సీ నోట్లకు కొరత ఏర్పడిందని జైట్లీ ఇవాళ ట్విటర్లో పేర్కొన్నారు. నగదు కొరత తాత్కాలికమే ని త్వరలోనే ఈ పరిస్థితిని చక్కదిద్దుతామని వెల్లడించారు.