YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హాట్ కేక్ ను త‌ల‌పిస్తున్న విశాఖ భూములు

హాట్ కేక్ ను త‌ల‌పిస్తున్న విశాఖ భూములు

విశాఖ‌ప‌ట్ట‌ణం, అక్టోబ‌రు 6, 
‌విశాఖలో భూములకు డిమాండ్ పెరిగింది. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన వెంటనే భూముల క్రయవిక్రయాలు విశాఖలో విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి నెలలో ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు. అప్పటి నుంచే విశాఖ భూములకు డిమాండ్ పెరిగింది. విశాఖ రాజధానితో పాటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం కూడా విశాఖలో భూముల ధరలు పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.మామూలుగానే విశాఖలో భూముల ధరలు ఎక్కువ. ప్రశాంతమైన నగరం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో ఎక్కువ మంది విశాఖలో స్థిరపడాలనుకుంటారు. అంతేకాదు విశాఖలో కొంత కాలం ఉన్న వారు అక్కడి వాతావరణానికి అలవాటుపడి అక్కడి నుంచి కదలరు. దీంతో పాటు అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండటం కూడా విశాఖకు కలసి వచ్చింది. నిజానికి జనవరి నెలనుంచే విశాఖలో భూముల క్రయవిక్రయాలు పెరగాల్సి ఉంది.మార్చి నెలలో కరోనా రావడంతో దాదాపు మూడు, నాలుగు నెలలు క్రయవిక్రయాలు జరగలేదు. అయితే తాజాగా భూముల రిజిస్ట్రేషన్లు విశాఖలో పెరిగాయి. ఇప్పుడు విశాఖలో భూములు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. విశాఖ నగరంతో పాటు దాని శివారు ప్రాంతాల్లోనూ భూముల కొనుగోళ్లకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక విశాఖ సిటీలో అయితే చదరపు గజం ధర లక్ష వరకూ పలుకుతుండటం విశేషం.జులై నెల నుంచే రిజిస్ట్రేషన్లు విశాఖలో పెరిగాయి. ఒక్క ఆగస్ట్ నెలలోనే దాదాపు ఐదు వేల వరకూ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. విశాఖ చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల క్రయ విక్రయాలు పెరగడంతో ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగింది. రానున్న కాలంలో విశాఖలో భూముల ధరలు మరింత పెరుగుతాయని అంచనా ఉంది. ఇప్పుడు అమరావతి కంటే విశాఖలోనే భూముల క్రయ విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. విశాఖ రాజధానిగా ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకంతోనే భూముల క్రయ విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెబుతున్నారు

Related Posts