విజయవాడ, అక్టోబరు 6,
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడి అప్పుడే 17 మాసాలు పూర్తయ్యాయి. అంటే మరో ఏడాదిలో రెండున్నరేళ్లు పూర్తవుతాయి. ఈ క్రమంలో జగన్ మొదట్లోనే చెప్పినట్టు.. తన మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల తర్వాత రీషఫెల్ చేయడానికి సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రుల విషయం చర్చకు వస్తోంది. సీఎం జగన్‌తో కలిపి మొత్తం పాతిక మంది మంత్రులు ఉన్నారు. ఆయనను పక్కన పెడితే.. మొత్తం 24 మంది ఉన్నారు. వీరిని రీప్లేస్ చేయాలి. అయితే, ఇప్పుడున్న పరిస్థితిలో అందరినీ మార్చడం కుదిరేపనికాదు. కీలకమైన శాఖలను చూస్తున్న వారిలో జగన్‌కు అత్యంత సన్నిహితులు, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న వారు ఉన్నారు. వారిని మార్చే పరిస్థితి ఉండదు.గుండు గుత్తుగా మార్చేసే కంటే.. పనితీరు ఆధారంగా మార్చడం ద్వారా ఇటు ప్రజల్లోను, ఆ పార్టీలోను కూడా ఉత్తమ సందేశాన్ని పంపినట్టు అవుతుందని పార్టీలో సీనియర్ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఏయే మంత్రులు బెస్ట్‌గా ఉన్నారు? ఎవరెవరు.. పదువులు వచ్చిన తర్వాత కూడా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు ? అనే చర్చ సాగుతోంది. దీంతో మొత్తం 10 మంది మాత్రమే దూకుడుగా ఉన్నారని, ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారని, మిగిలిన 14 మంది కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూనే .. జగన్ మెప్పుకోసం పనిచేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీరిని మార్చడం ఖాయమని అంటున్నారు. వీరిలోనే ఒకరిద్దరు.. వివాదాస్పదం కూడా అయ్యారని చెబుతున్నారు.ఇక, తొలి పది మంది బెస్ట్ మంత్రుల జాబితా ఇప్పుడు వైసీపీ నేతల సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వీరిలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జలవనరుల శాఖ మంత్రి అనిల్, పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వంటివారు తొలి పది మంది ఉత్తమ మంత్రుల్లో ఉన్నారు.ఇక, కొత్తగా ఎంపికైన చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజులు కొనసాగనున్నారు. మిగిలినవారిలో డిప్యూటీ సీఎంగా ఉన్న ధర్మాన కృష్ణదాస్‌ను కూడా మార్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మిగిలిన వారిని రీప్లేస్ చేయడం ఖాయమని.. అంటున్నారు వైసీపీ సీనియర్లు. ఈ లిస్టులో ఫస్ట్ పేర్లు గుమ్మనూరు జయరాం. చెరుకువాడ రంగనాథరాజు, తానేటి వనిత, విశ్వరూప్, శంకర్ నారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్లు లైన్లో ఉన్నాయి. ఏదేమైనా మరో ఐదారు నెలల్లోనే జగన్ కేబినెట్ మార్పులు, చేర్పులతో అధికార వైఎస్సార్‌సీపీలో రాజకీయం హీటెక్కనుంది.