హైద్రాబాద్, అక్టోబరు 6,
కరోనా కాలంలో ప్రభుత్వాల ప్రణాళికా రాహిత్యం కారణంగా విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. విద్యా సంస్థలు తెరవడానికి వీలులేని సమయంలో విద్యార్థుల బోధన ఎలా అన్న విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కూడా బాధ్యతా రహితంగా, ప్రణాళికా రహితంగా వ్యవహరించాయి. దీంతో విలువైన విద్యా సంవత్సరం వృధా కాకుండా నిలువరించడంలో విఫలమయ్యారు. కొద్ది మంది విద్యార్థులకు బోధన...చాలా మంది విద్యార్థులకు బోధన లేకుండా ఈ కాలమంతా గడిచిపోయింది. విద్య విషయంలో సమానత్వం లేకుండా పోయింది. కనీసం ఇది గుర్తించి అయినా ఈ విద్యా సంవత్సరాన్ని జీరో ఇయర్ గా ప్రకటించి ఉంటే అసంఖ్యాక విద్యార్థులకు ఊరట కలిగి ఉండేది.ఒక్క ఒడిశా రాష్ట్రం మాత్రమే విద్యాసంవత్సరాన్ని పూర్తిగా రద్దు చేసింది. మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు భిన్నంగా విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే కరోనా వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్న ఈ సమయంలో విద్యాసంస్థలను తెరిచే ధైర్యం ప్రభుత్వాలు చేయడంలేదు. ఒక వేళ విద్యాసంస్థలు తెరిచినా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించే ధైర్యం చేసే పరిస్థితి లేదు. ఆరంభం నుంచీ కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుని ఉండి ఉంటే ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదు. వ్యాక్సిన్ తో సంబంధం లేకుండానే వైరస్ నియంత్రణలో ఉండేది. విద్యార్థుల భవిష్యత్ ను ఫణంగా పెట్టి మరీ కేంద్రం విద్యా సంస్థలను తెరిచేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది.ఇందులో ట్విస్ట్ ఏమిటంటే...ఆ మార్గ దర్శకాల ప్రకారం పాఠశాలలు తెరవాలా వద్దా అన్న విషయాన్ని రాష్ట్రాల ప్రభుత్వాలే విద్యార్థుల తల్లిదండ్రులు, గార్డియన్ల తో చర్చించి వారి అంగీకారంతో నిర్ణయం తీసుకోవాలి. అంటే పాఠశాలలు తెరిస్తే విద్యార్థులకు కరోనా సోకే ప్రమాదం, ముప్పు ఉందనీ తెలిసీ కేంద్రం తన మంచి చెడుల భారాన్ని రాష్ట్రాలకు వదిలేసింది. నిజానికి పాఠశాలలు, కళాశాలలు తెరిస్తే వాటిని కోవిడ్ నిబంధన మేరకు శానిటైజ్ చేసి, కరోనా వ్యాప్తి జరక్కుడా చూడాలి. అయితే ఇది ఇప్పట్లో సాధ్యమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక ఆన్‌లైన్ బోధన భేషుగ్గా జరుగుతోందని రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ వాస్తవంగా అవి పేద విద్యార్థులకు అందడం లేదు.ఈ నేపథ్యంలో విద్యసంవత్సరాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాం. పరీక్షలు నిర్వహించేస్తాం అని చెప్పడం పేద విద్యార్థులకు అన్యాయం చేయడమే అవుతుంది. మహమ్మారి వ్యాప్తి నియంత్రణను గాలి కొదిలేసి, విద్యార్థుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి విద్యా సంస్థలను కోవిడ్ నిబంధనల మేరకు తెరవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడం...వాటిని ఔదాల్చడానికి రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధ పడుతుండటం ఎంత మాత్రం సరైనది కాదు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకూ, అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ విద్యార్థులందరికీ అందించే వరకూ విద్యాసంవత్సరం కొనసాగింపుపై అసంబద్ధ నిర్ణయాలు తీసుకోకుండా ఉండటమే మేలు.