తిరుపతి అక్టోబరు 6
శేషచల ఆడవుల్లోనే కాదు. తిరుపతి పట్టణంలో కూడా ఎర్ర చందనం స్మగ్లింగ్ పురి విప్పింది. తాజాగా తిరుపతి లోని తిరుచానూరు, చంద్రగిరి బైపాస్ రోడ్డులో దాచిపెట్టిన ఐదు ఎర్ర చందనం దుంగల గుట్టును పోలీసులు రట్టు చేసారు. ఎర్ర చందనం దుంగలను అక్రమ రవాణా చేస్తుండగా టాస్క్ ఫోర్స్ దాడి చేసింది. రైల్వే కోడూరు టాస్క్ ఫోర్స్ ఆర్ ఐ కృపానంద టీమ్ సోమవారం అర్థరాత్రి ఒక ఆటోను అనుమానంతో ఆపి తనిఖీ చేసారు. దాంట్లో ఐదు దుంగలండడంతో ఆటోను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిన్న గొట్టి గల్లు కు చెందిన కంచం సాయి ప్రసాద్ (21), మేకల శివారెడ్డి (37), బత్తల దిలీప్ కుమార్ (27)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తరచు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. డీఎస్పీ వెంకటయ్య మాట్లాడుతూ తిరుపతి బైపాస్ రోడ్డు లోని ఎమ్మార్ పల్లి సర్కిల్ వద్ద ఉన్న ఇందిరమ్మ ఇళ్ల వద్ద నుంచి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లు తెలిసిందని అన్నారు. దీంతో అప్రమత్తమై టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఆ ప్రాంతానికి పంపినట్లు తెలిపారు. వీ రు సమీపంలో దుంగలను డంప్ చేసి రవాణా కు పాల్పడుతున్నారని చెప్పారు. మరి కొన్ని దుంగలను కూడా డంప్ చేసి ఉంటారనే అనుమానం తో వీరిని విచారిస్తున్నట్లు తెలిపారు.