YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

బ్రాహ్మణుల కులవృత్తి ముమ్మాటికీ పౌరోహిత్యమే. బ్రహ్మయజ్ఞం స్మార్త సభలో స్వామి స్వరూపానందేంద్ర

బ్రాహ్మణుల కులవృత్తి ముమ్మాటికీ పౌరోహిత్యమే. బ్రహ్మయజ్ఞం స్మార్త సభలో స్వామి స్వరూపానందేంద్ర

పురోహితుల కోసం నేను నిలబడతా   మీరంతా సంస్కారవంతంగా ఉండండి  -అర్చకుల వేతనాలను పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది  -కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా జాప్యమవుతోంది.
బ్రాహ్మణుల కుల వృత్తి ముమ్మాటికి పౌరోహిత్యమే అన్నారు విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి. బ్రాహ్మణుల కుల వృత్తిగా పౌరోహిత్యాన్ని గుర్తించాలని సూచించారు స్వామీజీ. విశాఖ శ్రీ శారదాపీఠంలో గురువారం ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య నిర్వహించిన బ్రహ్మయజ్ఞం స్మార్త సభకు ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్రతో కలిసి స్వామీజీ హాజరయ్యారు. ఈ సభలో రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన పురోహిత ప్రముఖులు పాల్గొన్నారు. సభనుద్దేశించి స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ భారతావనిలో సర్వోన్నతమైన కులం బ్రాహ్మణ కులం మాత్రమేనని స్పష్టం చేసారు. అయితే అర్చకులు, వేద పండితుల జీవితాలు గాలిపటాల్లా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పురోహితులకు ఏదైనా జరిగితే ఆ కుటుంబాలను ఎలా రక్షించాలన్నదే తన  ఆలోచనగా ఉందని చెప్పారు స్వామీజీ. వేద పండితులకు భృతి పెంచడానికి, అర్చకులకు వంశపారంపర్య హక్కులు సాధించడానికి విశాఖ శారదాపీఠం కృషి చేసిందని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం అర్చకులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని భావిస్తోందన్నారు. బ్రాహ్మణులకు ముందుండి నిలబడాలన్నదే విశాఖ శ్రీ శారదాపీఠం లక్ష్యమని స్పష్టం చేశారు. అర్చకుల వేతనాలను 15 వేల రూపాయలకు పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అయితే కొంతమంది అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల అది ఆలస్యమవుతోందని స్వామి స్వరూపానందేంద్ర తెలిపారు. పురోహితుల శాశ్వత సంక్షేమం కోసం ఎవరూ ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పురోహితులకు పాలకులు అండగా నిలబడాలని, అటువంటి ఉద్యమంలో తొలి అడుగు విశాఖ శ్రీ శారదాపీఠమే వేస్తుందని స్పష్టం చేశారు స్వామీజీ. వచ్చే ఏడాది విశాఖ వేదికగా అర్చకులు, పురోహితులు, వేద పండితులతో భారీ సదస్సును విశాఖ శ్రీ శారదాపీఠం నిర్వహిస్తుందని వెల్లడించారు స్వరూపానందేంద్ర స్వామి. ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర స్వామి మాట్లాడుతూ జనావళి తలపెట్టే ఏ సంకల్పానికైనా ముందుండేది పురోహితులేనన్నారు. ధర్మాన్ని పరిరక్షించడంతో పాటు హైందవ జాతిని జాగృతం చేస్తున్న ఘనత బ్రాహ్మణులదేనని ప్రశంసించారు. ప్రసంగం అనంతరం ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వెబ్సైట్ ద్వారా చేపట్టనున్న పురోహిత కుటుంబ సర్వేను పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ప్రారంభించారు. పురోహితుల జీవన శైలికి దర్పణం పట్టేలా చిత్రీకరించిన మార్గదర్శకులు సినిమా టీజర్ ను విడుదల చేశారు. అలాగే ఆట గదరా శివ లఘుచిత్రం నిర్మాత వీరంకి కాశిని స్వామీజీ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వెబ్సైట్ నిర్వాహకులు చరణ్, చక్రపాణిలను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే వేదికపై దారముక్కల వారి పంచాంగాన్ని ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర స్వామి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సమాఖ్య ప్రతినిధులు ఈమని రామచంద్ర సోమయాజులు, యామిజాల నరసింహమూర్తి, పొదిల నారాయణమూర్తి, నాగాభట్ల సుబ్రహ్మణ్యం, బంకుపల్లి అంజనీ కుమార్, తెన్నేటి సునీల్ శర్మ, నాగాభట్ల రవి, మైదుగోళం శ్రీనివాసరావు, రామడుగు రామకృష్ణ, పురాణం శేషు, అంపోలు ఉమా మహేశ్వర శర్మ, పెంటా శ్రీధర్, మేడూరి సంతోష్, బ్రాహ్మణ సంఘాల నాయకులు సత్యవాడ దుర్గా ప్రసాద్, కోనూరు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts