న్యూఢిల్లీ అక్టోబరు 6
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. సుమారు నలభై నిమిషాలపాటు ఇద్దరు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని సీఎం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రధానికి జగన్ వివరించినట్లు సమాచారం. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటుందని జగన్ మోదీకి తెలిపారు. దీంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మోదీకి జగన్ వివరించారు. దీంతో పాటు రాజకీయ అంశాలు కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. అయన వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూరును దృష్టిలో పెట్టుకుని వైకాపా కేంద్ర ప్రభుత్వంలో చేరుతుందనే ప్రచారం మీడియాలో విస్తృతంగా జరిగింది. అటు బీజేపీ కానీ, ఇటు వైకాపా కానీ దీనిపై ఏం మాట్లాడ్డం లేదు. జగన్ ప్రధాని.మోడీని చివరిసారిగా ప్రత్యక్షంగా కలిసింది ఫిబ్రవరి 12న. ఆ తర్వాత కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో వీడియో సమావేశాల ద్వారా మాట్లాడటం తప్పితే రాష్ట్ర సమస్యలపై ప్రత్యేకంగా కలవలేదు. సెప్టెంబర్ 22న కేంద్ర హోంమంత్రి అమిత్షా, 23న జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్లను కలిసి వివిధ అంశాలపై జగన్ చర్చించారు. దాదాపు 8 నెలల తర్వాత మోడీ, జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధాని నివాసం నుంచి బయటకు వచ్చిన జగన్ ఉల్లాసంగా ఉత్సాహంగా కన్పించారు.