YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆరేళ్ల‌లోనే నూరేళ్ల అభివృద్ధి..... మంత్రి హరీష్ రావు

ఆరేళ్ల‌లోనే నూరేళ్ల అభివృద్ధి..... మంత్రి హరీష్ రావు

సిద్దిపేట అక్టోబర్ 6 
‌ప్ర‌జ‌ల సంక్షేమం కోసం పాటుప‌డుతున్న టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వ‌దించాల‌ని ఆర్థిక మంత్రి హ‌రీష్‌రావు పిలుపునిచ్చారు. దుబ్బాక ఉప ఎన్నిక‌లో పోటీ చేస్తున్న సోలిపేట సుజాత‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని మంత్రి హరీష్ రావు కోరారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను మిగితా రాష్ట్రాలు ఆదర్శంగా  తీసుకుంటున్నాయని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రతీ అడుగు రైతుల కోసమేనని చెప్పారు. ఆరేళ్ల‌లోనే నూరేళ్ళ అభివృద్ధిని చేసి చూపించిన ఘనత ఈ తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని వివరించారు. దొంగ రాత్రి కరెంటు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్స్, కాలిపోయే మోటార్లు, ఎరువులు, విత్తనాల కోసం చెప్పులు లైనులో పెట్టే చరిత్రను కనుమరుగు చేశామని స్పష్టం చేశారు. తొలి ఏడాదిలో మిషన్ కాకతీయ, 2వ ఏడాదిలో 24 గంటల ఉచిత విద్యుత్, 3వ ఏడాదిలో రైతు బంధు, 4వ ఏడాదిలో రైతు భీమా, 5వ ఏడాదిలో కాళేశ్వరం నీళ్లు, ఇప్పుడు కొత్త రెవెన్యూ చట్టం ఈ ప్రభుత్వం సాధించిన గొప్ప విషయాలు అని అన్నారు. మేడిగ‌డ్డ‌ నుండి మిరుదొడ్డికి 15 తాటిచెట్ల ఎత్తుకు నీళ్లు తెచ్చామని హరీష్ రావు చెప్పారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి జానారెడ్డిలు కూడా తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులేనని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధిని చేపట్టిన ఘనత కేవలం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో కనిపిస్తున్న స్పష్టమైన మార్పే మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతు అవుతేనే మన గెలుపునకు సార్థకత దక్కుతుందని అన్నారు. మన ఇంటి పార్టీ మన గులాబీ పార్టీ అని.. దుబ్బాక అభివృద్ధి దివంగత ఎమ్మెల్యే  రామలింగారెడ్డి ఆలోచనను నిజం చేసేలా మన అభ్యర్థి సుజాతను భారీ మెజారిటీతో గెలిపిద్దాం అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
సంక్షేమంలో దూసుకుపోతున్న తెలంగాణ‌ను బీజేపీ అణ‌గ‌దొక్కే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మంత్రి పేర్కొన్నారు రైతుల గురించి భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏనాడూ ఆలోచించ‌లేదు.. వారికి మేలు క‌లిగించే ప‌నులను చేప‌ట్ట‌లేద‌ని తెలిపారు. దుబ్బాక మండకం బీజేపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాస్థి శ్రీనివాస్, దౌల్తాబాద్ మండలం ముబారస్‌పూర్‌ గ్రామానికి  చెందిన వార్డు మెంబర్స్ సిద్ధులు తదితరులు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హ‌రీష్‌రావు మాట్లాడుతూ.. జాతీయ పార్టీల తెలంగాణ‌కు ఒరిగిందేమీ లేద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల సంక్షేమాన్ని ఆ రెండు పార్టీలు ప‌ట్టించుకోలేద‌ని మండిప‌డ్డారు. బీజేపీ రైతుల పొట్ట కొడుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. మోటర్లకు మీటర్లు పెట్టడం ఆ ప్రభుత్వంలోని మంత్రులకే న్యాయంగా అనిపించలేదని, అందుకే రాజీనామా చేశారని గుర్తు చేశారు. కార్పొరేట్ సంస్థల చేతికి రైతుల బతుకులను అప్పగించే ప్రమాదకరమైన ఆలోచనకు కేంద్రం తెరతీసిందని అన్నారు. మన దేశంలోనే 280 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు ఉత్పత్తి అవుతాయని, ఇందులోనే పుష్కలంగా మక్కలను విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉందని వివరించారు. కానీ విదేశాల నుండే మక్కలను దిగుమతి చేయడానికి కేంద్రం పెద్దలు సంతకాలు చేసి వచ్చారని హరీష్ రావు ఆరోపించారు.

Related Posts