అనంతపురం, అక్టోబరు 7,
అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించిన వైసీపీ నాయకుడు, మాజీ పోలీస్ గోరంట్ల మాధవ్ అలక పాన్పు ఎక్కారా? పార్టీ నేతలతో ఆయన అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ ఎంపీలు. ఇటీవల సీఎం జగన్ పార్టీ ఎంపీలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించినప్పుడు ఆలస్యంగా రావడంతోపాటు చివరి వరుసలో కూర్చున్నారు. పైగా ముభావంగా ఉన్నారని పార్టీలో చర్చ సాగుతోంది. దీంతో ఎంపీ గోరంట్ల వ్యవహారంపై స్థానికంగా నేతలు ఏమైందనే విషయంపై ఆరా తీస్తున్నారు.ఇదిలావుంటే.. స్థానికంగా ఎంపీ గోరంట్ల మాధవ్ దూకుడుగా ఉంటారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఎంపీ నియోజకవర్గం పరిధిలోని హిందూపురం అసెంబ్లీ స్థానం సహా మరో రెండు స్థానాలపై ఆయన కన్నేశారనే ప్రచారం ఉంది. ఇక్కడ పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. తన మాట వింటేనే ఎంపీ లాడ్స్ నుంచి నిధులు ఇస్తానని కొన్నాళ్ల కిందట ఇక్కడి నాయకులకు తెగేసి చెప్పడం.. దీనిపై విజయసాయిరెడ్డి ఆయనకు క్లాస్ ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఈ పరిణామాలతోనే గోరంట్ల మాధవ్ అలక బూనారనే వ్యాఖ్యలు ఓ వర్గం నేతల నుంచి వినిపిస్తున్నాయి.అయితే, గోరంట్ల మాధవ్ అలక వెనుక మరో కారణం ఉందని మరో వర్గం నేతలు చెబుతున్నారు. తనకు అనుకూలంగా ఉన్న ఓ వ్యక్తికి స్థానికంగా హిందూపురంలో ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరుతున్నారని.. ఈ విషయంలో విజయసాయిరెడ్డిపై కూడా ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు. ఆయనకు ఇక్కడి పగ్గాలు అప్పగిస్తే.. వచ్చే ఎన్నికల్లో బాలయ్యను ఓడించి రికార్డు సృష్టించే బాధ్యత తాను తీసుకుంటానని కూడా హామీ ఇస్తున్నారట.అయితే, ఈ విషయంలో సాయిరెడ్డి ఏమీ చెప్పలేదని, సీఎం జగన్ అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తే.. ఆయన స్పందించలేదని ఈ కారణంగానే ఎంపీ గోరంట్ల మాధవ్ మౌనంగా ఉంటున్నారని అంటున్నారు. ఏదేమైనా.. తాజా పరిణామాలను బట్టి.. మాధవ్‌లో మార్పు మాత్రం కనిపించిందని అంటున్నారు పరిశీలకులు. అందుకే గతంతో పోలిస్తే ఆయనలో దూకుడు తగ్గిందనే తెలుస్తోంది.