విజయవాడ, అక్టోబరు 7,
రాజకీయం అంటేనే మాయా జూదం. దానిని మయసభతో కూడా పోల్చాలి. ఇక్కడ లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా కనిపిస్తుంది. సెంటిమెంట్లకు సెంటీమీటర్ కూడా జాగా ఉండదు. అందుకే చాలా మంది రాజకీయాల్లో రాణించలేరు. సినిమా వారికి కాస్తా ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయని చెబుతారు. అలాగే సులువుగా వారు ఎవరినైనా నమ్మేస్తారు. రాజకీయాల్లో కూడని పనులే ఇవి. జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ రాజకీయం 2008లో మొదలైంది అనుకున్నా ఇప్పటికే పుష్కర కాలం గడిచిపోయింది. నిజానికి ఇది చాలా ఎక్కువ సమయమే. ఎన్నో అనుభవాలు నేర్పించాల్సిన సమయమే. కానీ పవన్ కల్యాణ‌్ తీరు చూస్తే ఆయనకు ఇంకా రాజకీయాలు పూర్తిగా ఒంటబట్టినట్లుగా కనిపించదు.ఇక పవన్ కల్యాణ‌్ తో ఒకనాడు వేదిక పంచుకున్న నరేంద్ర మోడీ ఇపుడు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ముందుకు రావడంలేదు. మరో వైపు మీ పార్టీని బీజేపీలో విలీనం చేయండని ఎన్నో అభ్యర్ధనలు చేసిన బీజేపీ యోధ అమిత్ షా ఇపుడు పవన్ కల్యాణ‌్ ఊసు తలవడంలేదు. చిత్రమేంటంటే ఏపీలో బీజేపీ కీలకనేతలు తమ పని తాము చేసుకుని పోతున్నారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినా తామే రాజకీయ మోతుబరులమని బీరాలు పలుకుతూ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరి పొత్తు పార్టీ జనసేన సంగతేంటన్న ప్రశ్న రావచ్చు. అది అందరికీ వచ్చింది. ఇపుడిపుడే పవన్ కల్యాణ‌్ కి కూడా వస్తోంది. అందుకే ఆయన అన్నీ తెలుసుకుంటూ దారిలో పడుతున్నారు.ఇక జనసేన అంటూ 2014 మార్చి నెలలో ఆర్భాటంగా పార్టీని పవన్ కల్యాణ‌్ ప్రకటించారు. ఆ తరువాత దాని మీదనే ఆయన ఎన్నో రాజకీయాలు చేస్తూ వచ్చారు కానీ ఒక గట్టి ప్రాంతీయ పార్టీగా రూపం ఇవ్వలేకపోయారు. సంస్థాగతంగా చూసుకుంటే జనసేనకు క్షేత్ర స్థాయిలో పట్టు లేదని అంతా ఎన్నో సార్లు విమర్శలు చేశారు. అయినా పవన్ కల్యాణ‌్ వాటిని ఇన్నాళ్ళూ నిర్లక్ష్యం చేశారు. అయితే ఇపుడు పవన్ కల్యాణ‌్ ఎందుకో తన పార్టీ మీద కాసింత శ్రద్ధ పెట్టారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో బలమైన నియోజకవర్గాలను గుర్తించి అక్కడ సమర్ధులైన వారిని ఇంచార్జిలుగా నియమించాలని పవన్ కల్యాణ‌్ డిసైడ్ అవడం శుభ పరిణామమే. అలాగే వారి ద్వారా ఇకపైన పార్టీ కార్యక్రమాలు పరుగులెత్తించాలని కూడా పవన్ కల్యాణ‌్ నిర్ణయించుకున్నారని అంటున్నారు.జనసేనలో పవన్ కల్యాణ‌్ గ్లామర్ తప్ప పార్టీ ఎక్కడ ఉందన్న చులకన భావం బీజేపీకి ఉంది. తమది గట్టి పార్టీ అని వారికేదో నమ్మకం కూడా ఉంది. పవన్ కల్యాణ‌్ జనాకర్షణను తమకు అనుకూలంగా వాడుకుని ఆయన పార్టీకి కొన్ని సీట్లు ఇస్తే చాలు అన్న భావనలో బీజేపీ ఉన్నట్లుగా చర్చ అయితే ఉంది. మరి దీని మీద పవన్ కల్యాణ‌్ కి కూడా అనుమానాలు ఉన్నాయో లేక కాషాయదళం వ్యూహాల మీద ఆయనకు కూడా కొత్త ఆలోచనలు వచ్చాయో తెలియదు కానీ జనసేనను కూటమిలో బలమైన పార్టీగా ప్రొజెక్ట్ చేయాలని గట్టిగానే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అంటే పెద్దన్న తానేనని కమలనాధులకు చెప్పడం ద్వారా పొలిటికల్ అడ్వాంటేజ్ ఏదైనా ఉంటే దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారన్నమాట. పవన్ కల్యాణ‌్ ఇప్పటికైనా అలెర్ట్ అయి జనసేన పట్ల శ్రద్ధ పెట్టడాన్ని పార్టీ వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఇదే తీరున నిలకడగా కనుక ఆయన ముందుకు సాగితే ఏపీలోనూ, కూటమిలోనూ కూడా పవన్ కల్యాణ‌్ పార్టీ విలువ బాగా పెరగడం ఖాయం అంటున్నారు.