విజయవాడ, అక్టోబరు 7,
ఏపీ రాజకీయాల్లో వైసీపీకి తలనొప్పులు అలాగే కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ నుంచి కొంత ఉపశమనం లభించింది అని సంతోషించే లోపునే దగ్గుబాటి పురంధేశ్వరి రూపంలో కొత్త కార్డు పార్టీ తీసి జగన్ మీదకు వదిలింది. దాంతో కన్నా లక్ష్మీనారాయణ కాలం నాటి సీన్లు మళ్ళీ ఏపీ రాజకీయ తెరమీద కనిపిస్తున్నాయి. అమరావతి రాజధానిని బేస్ చేసుకుని టీడీపీతో కోరస్ పలకడానికి బీజేపీలోని రెండవ సెక్షన్ ఇపుడు రెడీగా ఉంది. అమరావతి మన ఏకైన రాజధాని అన్న చిన్నమ్మ మాట రేపు సుజనా చౌదరి నోట కూడా రావచ్చు. ఆయన సైతం మళ్ళీ యాక్టివ్ కావచ్చు అంటున్నారు.ఢిల్లీ వెళ్ళి జగన్ ఏపీకి హ్యాపీ మూడ్ తో వచ్చారు. బీజపీకి, కేంద్రానికి కూడా బిగ్ బాస్ లాంటి అమిత్ షాతో మంచి వాతావరణంలో చర్చలు సాగాయి. ఇక తనకు ఎదురులేదని జగన్ తలచారు. మత రాజకీయాలతో ఓ వైపు ఇబ్బంది పెడుతున్న సోము వీర్రాజు కూడా మెల్లగా దారిలో పడ్డారు. ఇక ఒక్క టీడీపీ మీదనే సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలి అని అనుకుంటున్న నేపధ్యం. ఇదిలా ఉండగానే బీజేపీ జాతీయ నాయకత్వం పురంధేశ్వరికి పెద్ద బాధ్యతలు అప్పగించి ఏపీ మీదకు వదిలింది. ఆమెకు ఉన్న రాజకీయ అనుభవం, ఎన్టీయార్ లెగసీ, కుటుంబ నేపధ్యం ద్రుష్ట్యా చూస్తే వైసీపీకి ఫ్యూచర్ లో భారీ దెబ్బ అవుతారని అంటున్నారు.ఇక జాతీయ అధికార ప్రతినిధి హోదాలో జీవీఎల్ నరసింహారావు ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా చొరవ ప్రదర్శించేవారు. ఆయన టీడీపీ మీద, చంద్రబాబు మీద హాట్ కామెంట్స్ తో రెచ్చిపోయేవారు. అది వైసీపీకి ఎంతో హుషార్ ఇచ్చేది. మరో వైపు వారణాసి రామ్ మాధవ్ లాంటి జాతీయ ప్రధాన కార్యదర్శి సైతం ఎక్కువగా తన బాణాలను టీడీపీ మీదనే ప్రయోగించడం ద్వారా అధికార పార్టీకి వెసులుబాటు కల్పించేవారు. ఇపుడు మారిన పార్టీ రాజకీయంతో వారిద్దరికీ పార్టీ పదవులు లేకుండా పోయాయి. అదే సమయంలో పురంధేశ్వరిని తీసుకురావడం కూడా ఒక వ్యూహం ప్రకారమే అంటున్నారు. ఇక అమరావతి రాజధాని విషయంలో ప్రతీ రోజూ బీజేపీ నుంచి కొత్త పోరు వైసీపీ ఎదుర్కోవాల్సివస్తుందని అంటున్నారు.బీజేపీకి జేపీ నడ్డా కొత్త జాతీయ ప్రెసిడెంట్. అయితే ఆయన గతంలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి లాంటి ఎంపీలతో సఖ్యతగా ఉండేవారని అంటారు. ఇపుడు ఆయన ఏకంగా తన కార్యవర్గాన్ని నియమించుకునే విషయంలో అటు అమిత్ షా, మోడీ సూచనలకు అనుగుణంగా వెళ్తూనే ఒక్కసారిగా పురంధేశ్వరిని తెరపైకి తెచ్చారు. ఆ విధంగా ఏపీలో యాంటీ వైసీపీ స్టాండ్ కి ఆయన కట్టుబడిపోయారు. అదే సమయంలో గతంలో తనతో సన్నిహితంగా ఉన్న టీడీపీ నుంచి వచ్చిన ఎంపీలకు ఒక్కసారిగా మహదానందాన్ని కలిగించేశారు. వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారన్న కారణంగానే జీవీఎల్ వంటి వారిని పక్కన పెట్టారా అన్న చర్చ కూడా ఇపుడు వస్తోంది. మరిపుడు పార్టీ పరంగా నడ్డాకు అమిత్ షా కూడా సూచనలు ఇవ్వగలరు కానీ ఆయనని కాదని పదవులు ఇచ్చిన వారిని తప్పించలేరుగా. మొత్తానికి చిన్నమ్మ, మరో జాతీయ కార్యదర్శి సత్యమూర్తి రూపంలో జగన్ కి కొత్త తలనొప్పి మొదలిపోయినట్లేనని విశ్లేషణలు ఉన్నాయి.