న్యూఢిల్లీ, అక్టోబరు 7,
విజయ్ మాల్యా.. భారత్ లోని బ్యాంకులను బురిడీ కొట్టించి విదేశాల్లో తలదాచుకుంటూ ఉన్నాడు. తాను ఎటువంటి తప్పూ చేయలేదని.. రుణాలు మొత్తం చెల్లించేస్తాను.. తన మీద ఉన్న కేసులను కొట్టివేయాలంటూ ఇప్పటికే కోరాడు. చూస్తుంటే తన అరెస్టును ముందుగానే మాల్యా ఊహించాడా అని మనకు అనిపిస్తూ ఉంది. తాజా పరిణామాలను చూస్తుంటే విజయ్ మాల్యాను సీక్రెట్ గా భారత్ కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. తీవ్రమైన ఆర్థిక నేరాలు చేశాడనే ఆరోపణలతో మాల్యా భారత్ లోని జైళ్లలో మగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌సంస్థ తరఫున తీసుకున్న రూ.9,000 కోట్ల రుణ ఎగవేతకు సంబంధించి మాల్యా కోర్టు కేసును ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా.. అప్పుడప్పుడు బయట కనిపిస్తూ ఉన్నాడు. విజయ్‌మాల్యాను భారత్‌కు తీసుకొచ్చేందుకు అప్పగించే ప్రక్రియ రహస్యంగా కొనసాగుతోందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అప్పగించే ప్రక్రియలో తాజా పరిస్థితి గురించి చెప్పలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. మాల్యా తరఫు న్యాయవాది అంకుర్‌సైగల్‌ను మాల్యాను అప్పగించే విషయంలో రహస్యంగా కొనసాగుతున్న ప్రక్రియలు ఏంటనేవి చెప్పాలని జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అశోక్‌భూషణ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశించింది. మాల్యా అప్పగింత ప్రక్రియ ముగియనున్న నవంబర్ 2 నాటికి ఈ వివరాలు తెలియజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదిలీ చేయడాన్ని నేరంగా కోర్టు ప్రకటించింది. దేశం నుండి పారిపోయిన ఎంతో మంది ఆర్థిక నేరగాళ్ళను భారత్ కు తిరిగి రప్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. భారత ప్రభుత్వం గతంలో కూడా ఆర్థిక నేరాలు చేసిన ఏ ఒక్క వ్యాపారవేత్తను వదిలిపెట్టబోమని చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు విజయ్ మాల్యాను భారత్ లోకి తీసుకుని వస్తే మాత్రం.. ఆర్థిక నేరగాళ్ల గుండెల్లో గుబులు రేగడం ఖాయమే..! ఇక ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని కూడా భారత్ కు రప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది భారత ప్రభుత్వం.