న్యూఢిల్లీ, అక్టోబరు 7,
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని కరోనా పరిస్థితులను బట్టి అక్టోబర్ 15 నుంచి పాఠశాలలు తెరువాలా వద్దా అన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపిన నేపథ్యంలో కరోనావైరస్ కారణంగా దాదాపు ఆరునెలలుగా సెలవులోఉన్న విద్యాసంస్థలు ఈ నెల 15 నుంచి తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో పాటించాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. స్కూళ్లు తెరిచిన రెండు వారాల వరకు విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వొద్దని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ఆన్‌లైన్ తరగతులు మాత్రం తప్పని సరిగా ప్రారంభం కావాలని పేర్కొన్నారు. స్కూళ్లను పునరుద్ధరించే పక్షంలో తప్పని సరిగా పేర్కొన్న మార్గదర్శకాలను అనుసరించాలని వెల్లడించారు. స్కూలులోని అన్ని చోట్ల పరిశుభ్రత, స్వచ్ఛమైన గాలి, కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టాలి. దీని కోసం పాఠశాలలు తగిన ఏర్పాట్లు చేయాలి. స్కూళ్లు సొంతంగానే నిబంధనలు, ప్రోటోకాల్స్ తయారు చేసుకోవాలి. తరగతి గదుల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు ఉండాలి.
విద్యార్థులు, ఉపాధ్యాయులు మాస్కులు తప్పని సరిగా ధరించాలి. విద్యార్థులు, టీచర్లు, పేరెంట్స్, కమ్యూనిటీ సభ్యులు, హాస్టల్ సిబ్బంది శానిటైజ్ పద్ధతులు పాటించాలి. అన్ని తరగతుల విద్యా క్యాలెండర్‌కు మార్పులు చేయాలి. పాఠశాల ప్రాంగణంలో డాక్టర్, నర్సు, ఆరోగ్య సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉండేలా చూడాలి. విద్యార్థులు, స్కూలు సిబ్బందికి సిక్ లీవ్, హాజరులో వెసులుబాటు కల్పించాలి. స్కూళ్లు తెరిచిన రెండు నుంచి మూడు వారాల వరకు విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వకూడదు. ఐసీటీ వినియోగం, ఆన్‌లైన్ విద్యను తప్పనిసరిగా కొనసాగించాలి. తల్లిదండ్రుల అనుమతితోనే విద్యార్థులు పాఠశాలకు హాజరుకావాలి. భౌతికంగా కన్నా ఆన్‌లైన్ విద్యను ఎంచుకునే అవకాశం విద్యార్థులకు ఇవ్వాలి. విద్యార్థుల హాజరులో ఈ మేరకు సౌలభ్యం కల్పించాలి.కాగా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలలు ప్రారంభం కాగా తొలి వారం రోజుల్లోనే 70 మంది పిల్లలకు కరోనా సోకడం భీతి కలిగిస్తోంది. దీంతో పిల్లల తల్లిదండ్రులు సాహసించి తమ పిల్లలను బడికి పంపుతారా లేక ఆన్ లైన్ విద్యకే పట్టు పడతారా అనేది తేలాల్సి ఉంది.