YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బీహార్ లో కొత్త పొత్తులు

బీహార్ లో కొత్త పొత్తులు

పాట్నా, అక్టోబ‌రు 7, 
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ కొత్త పొత్తులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా మాయావతి బీహార్ రాజకీయాల్లో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు బీహార్ ఎన్నికల బరిలో ఉంటారని మాయావతి ప్రకటించారు. దీంతో బీహార్ ఎన్నికల్లో కొత్త పొత్తులు సంతరించుకుంటున్నాయి. బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. ఎన్నికల ప్రచారం కూడా మొదలయింది.ఇప్పటికే బీజేపీ, జేడీయూ ఒక కూటమిగా, కాంగ్రెస్, ఆర్జేడీ మరో కూటమిగా బరిలోకి దిగాయి. అధికార, విపక్ష కూటములు రెండూ హోరాహోరీ పోరాడుతున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో మాయావతి మరో కూటమిని తెరపైకి తెచ్చారు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీతో మాయావతి పొత్తు పెట్టుకున్నారు. ఈ కూటమి బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని మాయావతి ప్రకటించారు. తాను కూడా బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు.రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ చీఫ్ ఉపేంద్ర కుశ్వానా తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని మాయావతి ప్రకటించడం విశేషం. ఇప్పటికే మాయావతి అనేక రాష్ట్రాల్లో పోటీ చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో బీఎస్పీ ఎమ్మెల్యేలు కీలకంగా మారారు. రాజస్థాన్ లో బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తన వైపు కలుపుకుంది. 2019 లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో కలసి మాయావతి పొత్తు పెట్టుకున్నారు. కానీ ఏ ఒక్క స్థానాన్ని కూడా బీఎస్పీ గెలుచుకోలేకపోయింది.మాయావతి దళితుల ఓట్లను చీల్చి అధికార పార్టీకి పరోక్షంగా ఉపయోగపడతారు తప్ప మరొకటి లేదని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే సామాజిక వర్గాల పరంగా ఓటర్లు బీహార్ లో డిసైడ్ అయిపోయారంటున్నారు. మాయావతి పార్టీ రాకతో కొంత నష్టం జరుగుతుంది విపక్ష పార్టీలకు మాత్రమేనని అధికార పక్షం బీజేపీ, జేడీయూ ధీమాగా ఉన్నాయి. కానీ అధికార పార్టీ ఓటు బ్యాంకుకు కూడా చిల్లుపడుతుందని ఆర్జేడీ భావిస్తుంది. మాయావతి ఎంట్రీతో బీహార్ ఎన్నికల్లో ఎవరికి దెబ్బ పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో శివసేన పోటీకి సిద్ధపడుతోంది. కనీసం 50 అసెంబ్లీ నియోజవకర్గాలలో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలపాలని భావిస్తున్నట్లు పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. అయితే తక్కువలో తక్కువ 30 నుంచి 40 స్థానాలలో మాత్రం కచ్చితంగా పోటీలో ఉంటామని ఆయన చెబుతున్నారు. పార్టీ విస్తరణ వ్యూహాలలో భాగంగా బీహార్ లో పోటీకి శివసేన సిద్ధపడుతున్నదని భావించాలా? లేక ఎన్డీయే కూటమి విజయావకాశాలను దెబ్బతీయాన్న లక్ష్యంతో రాష్ట్రంలో అభ్యర్థులను నిలపనుందా అన్న విషయంలో స్పష్టత ఆ పార్టీలోనే ఉన్నట్లు కనిపించడం లేదు.పోటీకి రాజకీయ కారణాలను చెప్పడంలో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తడబడ్డారు. ‘ధోనీ ద అన్ టోల్డ్ స్టోరీ‘ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత జరిగిన పరిణామాలు మహారాష్ట్రలో శివసేనకు ఒకింత ఇబ్బందికర పరిస్థితులను సృష్టించాయనే చెప్పాలి. బీహార్ కు చెందిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ లో నెపోటిజం మాత్రమే కాదు, డ్రగ్స్ చీకటి కోణం...రాజకీయ సంబంధాలు, ప్రాంతీయతత్వం అన్నీ వెలుగులోనికి వచ్చాయి. బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కంగనా రనౌత్ ఏకంగా శివసేన అధినేత, ఆయన కుమారుడు లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. ఆమె కార్యాలయ భవనంలోని కొంత భాగాన్ని బృహన్ ముంబై అక్రమ కట్టడమంటూ కూల్చివేయడం కూడా శివసేనకే మచ్చ తెచ్చే విధంగా తయారైంది.శివసైనికులు కరోనాను కాదు కంగనాను తరిమి కొట్టాలన్న నినాదాలతో సుశాంత శింగ్ ఆత్మహత్య ఉదంతం రాజకీయ మలుపు తీసుకుంది. సరిగ్గా అదే సమయంలో బీజేపీ కంగనా రనౌత్ కు కేంద్ర బలగాలతో భారీ భద్రత కల్పించడం రాష్ట్రంలో ఆమెకు భద్రత లేదని కేంద్రం కూడా భావిస్తున్నదన్న సంకేతాన్ని ఇచ్చింది. అదిగో సరిగ్గా అప్పుడూ బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. శివసేన తొలి నుంచీ కూడా ఆధిపత్యమే తప్ప భాగస్వామ్యం అంగీకరించని వైఖరిని ప్రదర్శిస్తుంటుంది. సరిగ్గా ఆ వైఖరే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ నిర్ణయానికి ఆ పార్టీ రావడానికి కారణమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.అదీ కాక బీహార్ మాజీ డీజీపీ...గుప్తేశ్వర్ పాండే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపడానికి ప్రధానంగా ఆయనే కారణమన్నది శివసేన అభిప్రాయం. ఇఫ్పుడు ఆయన జేడీయూ అభ్యర్థిగా బీహార్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.  దీంతో ఆయన టార్గెట్ గా కూడా శివసేన బీహార్ ఎన్నికల బరిలో దిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Related Posts