గుంటూరు, అక్టోబరు 7,
రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి దూకుడు అవసరం. సైలంట్‌గా వ్యూహాలు రచిస్తూ ముందుకుసాగినా క్యాడర్‌లో ఆత్మవిశ్వాసం నింపలేం. మరీ ముఖ్యంగా తమకు పోటీగా ఉన్న పార్టీ బలమైనది అయితే.. బహిరంగంగానే యుద్ధానికి దిగాలి. అప్పుడే క్యాడర్‌లో జోష్ వస్తుంది.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మాకు బలమైన నేత ఉన్నాడనే దీమా ఏర్పడుతుంది. అయితే ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలో ఇప్పుడు ఆలోటు కనిపిస్తుంది. దీంతో టీడీపీ శ్రేణుల్లోనూ నిరుత్సాహం ఆవహిస్తుంది. చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నప్పటికీ పార్టీ శ్రేణులంతా వారసుడు లోకేష్‌పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. చినబాబు మాత్రం ఇంకా బావిలో కప్పలానే ఉండటం వారిని వేదనకు గురిచేస్తుందంట. జగన్ అధికారంలోకి వచ్చిన నాటినుండి టీడీపీ కీలక నేతలను టార్గెట్ చేస్తున్నాడు. ఆపార్టీలో కీలకంగా ఉన్న నేతలను వీలైతే తమవైపుకు తిప్పుకోవటం.. వీలు కాకుంటే కేసులతో జైలుపాలు చేయడం పరిపాటిగా మారింది. వైకాపా ప్రభుత్వం తీరును ఖండిస్తూ ఎలాంటి ఆందోళనలు చేసినా మార్పు కనిపించడం లేదు. ఆ స్థాయిలో టీడీపీని నిర్వీర్యం చేసేందుకు జగన్ దూకుడును ప్రదర్శిస్తున్నాడు. అడపాదడపా చంద్రబాబు ప్రెస్‌మీట్‌లు పెట్టి ఖండిస్తున్నా.. చినబాబు మాత్రం ట్విట్టర్‌కే పరిమితం కావటం టీడీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుందంట.
మరోవైపు వైకాపాకు తోడు బీజేపీకూడా టీడీపీనే టార్గెట్ చేస్తుంది. బలమైన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని బలహీన పర్చడం ద్వారా ఆ స్థానాన్ని తాము భర్తీచేయవచ్చనే భావనలో బీజేపీ ముందుకెళ్తుంది. దీనిలో భాగంగానే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఏ విషయం వచ్చినా జగన్‌ను కాకుండా ముందుకు చంద్రబాబుపైనే శివాలెత్తుతున్నాడు. ఈ క్రమంలో టీడీపీ నేతలు దీటుగా స్పందిస్తున్నప్పటికీ.. చినబాబు మౌనంగా ఉంటుండటం, కేవలం ట్విటర్‌లకే పరిమితం కావడం టీడీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది. వైకాపా సర్కార్‌కు అనుకూలంగా కేంద్రం మూడు రాజధానులకు మద్దతు పలికితే.. తాను పాదయాత్ర చేసి ప్రజల్లోకి అమరావతే రాజధానిగా ఉండాలనే వాదనను తీసుకెళ్తానని చినబాబు ప్రకటించారు. కేంద్రం ఈ మేరకు మద్దతు ఇచ్చిన తరువాత మాత్రం ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండిపోయారు.
దీంతో టీడీపీ శ్రేణులు చినబాబు సైకిల్ యాత్ర ఎప్పుడు అన్నట్లుగా ఎదురుచూస్తుండటం గమనార్హం. ఇప్పటికైనా చినబాబు ప్రజల్లోకి రావాలని, దూకుడుగా రాజకీయాలు చేయాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు. వైకాపా ప్రభుత్వం పెట్టే కేసులుకు, దౌర్జన్యాలకు బెదరకుండా దూకుడుగా ప్రజల్లోకి వెళితే ప్రజాదరణ వస్తుందని, అలా కాకుండా ట్విటర్‌లకు, కార్యాలయాల్లో ఉండి వ్యూహాలకే పరిమితం అయితే రాబోయే కాలంలో పార్టీ క్యాడర్ మరింత చేజారే అవకాశాలు లేకపోలేదనే వాదన వినిపిస్తుంది. మరి చినబాబు ప్రజల్లోకి ఎప్పుడొస్తాడు.. వైకాపాకు దీటుగా తన రాజకీయ చతురతను ఎప్పుడు ప్రదర్శిస్తారో వేచి చూడాల్సిందే.