హైద్రాబాద్, అక్టోబరు 7,
గ్రేటర్ నగరానికి మణిహారంగా నిలిచి మెట్రో ఈనెల 7వ తేదీ నుంచి పట్టాలపై పరుగులు పెడుతుంది. ప్రారంభంలో ఆశించిన స్దాయిలో ప్రయాణికులు మొగ్గు చూపలేదని, గత వారం రోజుల నుంచి నగరంలో ఆర్టీసీ బస్సులు నడస్తుండటంతో మెట్రోకు కొంత ఆదరణ పెరిగింది. బస్సులు రాకముందు మూడు కారిడార్ల పరిధిలో రోజుకు 30వేలు మంది ప్రయాణించారని, గత మూడు రోజల నుంచి ప్రయాణికులు సంఖ్య మరో 10వేలు పెరిగినట్లు మెట్రో అధికారులు వెల్లడిస్తున్నారు. దసరా నాటికి 50వేల మంది రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నారు. నగరంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా తగ్గిందని, మరో రెండు వారాల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వైద్యశాఖ పేర్కొనడంతో మెట్రోలో వెళ్లేందుకు జనం మొగ్గు చూపుతారని భావిస్తున్నారు.ప్రస్తుతం మెట్రోలు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9గంటలవరకు సర్వీసు నడిపిస్తున్నారు. వైరస్ సోకకుండా మెట్రో సిబ్బంది, ఎప్పటికప్పుడు స్టేషన్ల శానిటైజేషన్ చేసి, ప్రయాణికులు మాస్కులు ధరించేలా చూస్తూ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతే లోపలికి అనుమతిస్తున్నారు. రైళ్లలోకి వెళ్లగా మార్కింగ్ చేసిన చోటు కూర్చోవాలని, నిలబడాలని ప్రకటన చేస్తూ ప్రయాణికుల మధ్య భౌతికదూరం పాటించేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.మొదటి కారిడార్ ఎల్బీనగర్, మియాపూర్ మార్గంలో 120ట్రిప్పులు నాగోల్, రాయదుర్గం కారిడార్‌లో 240 ట్రిప్పులు, మూడు మార్గాల్లో 680ట్రిప్పులు నడిపించి 40 వేల ప్రయాణికులను పలు ప్రాంతాలకు చేరవేశారు. ప్రయాణికులు ఎక్కువగా ఎల్బీనగర్, నాంపల్లి, అమీర్‌పేట, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్,మాదాపూర్, కొండాపూర్,నాగోల్, సికింద్రాబాద్, బేగంపేట, రాయదుర్గం స్టేషన్ల నుంచి ప్రయానిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సులు లాక్‌డౌన్‌కు ముందు ఏవిధంగా నడిచాయో అదే విధంగా పూర్తిస్దాయిలో రోజుకు 2500బస్సులు నడిస్తే మెట్రోపై రోజుకు లక్షమంది వెళ్లుతారని సిబ్బంది చెబుతున్నారు. మరో రెండు వారాల్లో మెట్రో సర్వీసులను పెంచి రాత్రి 10గంటలవరకు నడిపించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు, టికెట్లు కూడా నేరుగా తీసుకునేందుకు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిస్తున్నారు.