ముంబై అక్టోబరు 7,
డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టైన నటి రియా చక్రవర్తికి బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ముంబై పోలీసులు మీడియాకు హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే మీడియా రియా చక్రవర్తి విషయంలో పరిమితికి మించి ఉత్సాహం కనబరిచి ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే. రియా బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చే సందర్భంలో మీడియా ఆమె వాహనాన్ని వెంబడించరాదని పోలీసులు హెచ్చరించారు. ఆమెపై సంబంధం లేని ప్రశ్నలు అడగవద్దని సూచించారు. మీరు (జర్నలిస్టులు,రిపోర్టర్లు) సదరు సెలబ్రిటీలను, వారి న్యాయవాదులను ఇంటర్వ్యూ చేయాలనే ఉద్దేశంతో వారి వాహనాలను వెంబడించరాదని పేర్కొన్నారు.వాహనాలను వెంబడించడం నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసు డిప్యూటీ కమిషనర్ సంగ్రామ్‌సింగ్ నిశాందర్ తెలిపారు. అలా చేయడం వల్ల మీ జీవితాలతోపాటు, రోడ్ల మీద నడుస్తున్న సాధారణ ప్రజల జీవితాలకు అపాయం కలుగుతుందని పేర్కొన్నారు. సెలబ్రిటీల వాహనాలను వెంబడించే క్రమంలో డ్రైవర్‌తో పాటు, వారిని ప్రేరేపించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. బుధవారం రియా బెయిలు పిటిషన్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్టైన రియా సుమారు నెల రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉన్నారు. డ్రగ్స్ కేసులో మీడియా తనపై అసత్య ప్రచారం జరుపుతోందని వాటిని వెంటనే ఆపాలంటూ నటి రకుల్ ప్రీత్‌సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే