హైద్రాబాద్, అక్టోబరు 7
లాక్‌డౌన్ కారణంగా స్తంభించిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులను ఇంకా ప్రారంభించలేదు. ఇరు రాష్ట్రాల్లో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు మొదలైనా తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రం ఇంకా బస్సులు రోడ్డెక్కలేదు. బస్సు సర్వీసుల విషయంలో ఒప్పందాలను పున:సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతుండటంతో సర్వీసుల ప్రారంభం ఆలస్యమవుతూ వస్తోంది. ఈ అంశంపై ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు సమావేశమైనప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. బస్సు సర్వీసులు మీరే ఎక్కువ నడపాలి, అంటే మీరే తక్కువ నడపాలి అనే రెండు రాష్ట్రాల పంచాయితీ మధ్య ప్రైవేట్ బస్సులు జేబులు నింపుకుంటున్నాయి. తాజాగా బుధవారం మరోసారి హైదరాబాద్ బస్ భవన్‌లో ఇరు రాష్టాల ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం కానున్నారు.దసరా పండగ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులపై తాత్కాలిక ఒప్పందం చేసుకోవడానికి ఇరు రాష్ట్రాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రోజుకు 1.60 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతామని, ఏపీఎస్‌ఆర్టీసీ కూడా అన్ని కిలోమీటర్లకే పరిమితం కావాలని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. కానీ అందుకు ఏపీ అధికారులు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో అధికారుల స్థాయిలో మరోసారి చర్చలు నిర్వహించాలని గతంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణకు రోజూ 375 బస్సులను నడుపుతోంది. ఆంధ్రప్రదేశ్ 206 సర్వీసులకు మాత్రమే పరిమితం కావాలని తెలంగాణ కోరుతోంది.అయితే మిగిలిన మార్గాల్లో తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడుపుతుందా? లేదా? అన్న దానిపై క్లారిటీ ఇవ్వాలని ఏపీ అధికారులు కోరుతున్నారు. ఎవరూ బస్సులు నడపకపోతే మధ్యలో ప్రైవేట్ ట్రావెల్స్‌కు లాభం చేకూరుతుదని అభిప్రాయపడుతున్నారు. దీనిపై తెలంగాణ నుంచి స్పష్టత లేదని చెబుతున్నారు. అయితే ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో చర్చలు సఫలం కాకపోవడంతో ఇతర పొరుగు రాష్ట్రాలకు బస్సులు నడపాలని తెలంగాణ సర్కార్ కొద్ది రోజుల క్రితమే నిర్ణయించింది. ఈ మేరకు
మహారాష్ట్ర, కర్ణాటకకు బస్సులు నడుపుతున్నారు.మరోవైపు ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం కావాలంటే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్నినాని కొద్దిరోజుల క్రితం అన్నారు. మొత్తానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సర్వీసులను తిప్పే విషయంలో ఏకాభిప్రాయానికి వస్తేనే ఇరు రాష్ట్రాల మధ్య పూర్తిస్థాయిలో మళ్లీ ఆర్టీసీ బస్సులు తిరిగేలా కనిపిస్తోంది. బుధవారం జరిగే సమావేశంలో ఏం తేలనుందో వేచి చూడాలి.