కడప, అక్టోబరు 8,
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపపై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టిందా ? ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల విషయాలను ఆరాతీస్తోందా ? అంటే.. ప్రస్తుతం జిల్లా అధికారులు చెబుతున్న మాటలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవల కడప జిల్లాలకు కొందరు కేంద్రం నుంచి అధికారులు వచ్చి రహస్యంగా సమాచారం సేకరించి వెళ్లినట్టు తాజాగా తెలుస్తోంది. నిజానికి ఒక రాష్ట్ర సీఎం సొంత జిల్లా వ్యవహారాలను కేంద్రం సేకరించడం, పరిశీలించడం అనేది ఇదే ప్రథమం. పైగా తమకు సంబంధం లేని పార్టీ ప్రభుత్వం ఉన్న ఏపీలో ఇలా జరగడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది.విషయంలోకి వెళ్తే.. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాక.. తన జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడి రైతులు, ఇతర వృత్తుల వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం దిశగా పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మరీ ముఖ్యంగా తన సొంత నియోజకవర్గం పులివెందులను గ్రేటర్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో సీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా పులివెందుల సహా కడపకు సాగు, తాగు నీరు అందించేందుకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిణామాలు రాష్ట్రంలో పెద్దగా చర్చకు రాకపోయినా.. కేంద్రంలో మాత్రం వచ్చాయి.ఇటీవల పార్లమెంటు సమావేశాల సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. కడప ఉక్కు పరిశ్రమ విషయాన్ని ప్రస్థావించినప్పుడు.. కడప అభివృద్ధికి ప్రత్యేకంగా రాష్ట్రం తీసుకున్న నిధుల విషయాన్ని కేంద్రం వెల్లడించింది. కేంద్రం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రాయోజిత కార్యక్రమాలకు కడప జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా కడపను తీర్చిదిద్దడంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు సంస్థలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ జిల్లా ఆదర్శ జిల్లాగా మారే అవకాశం కనిపిస్తోందని, అందుకే కేంద్రం దీనిని ఓ మోడల్ డిస్ట్రిక్ట్ గా తీసుకుని ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.