విజయవాడ, అక్టోబరు 8,
రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు.. ఆయా పార్టీల నాయకులు.. పరస్పరం విమర్శించుకోవడం తెలిసిందే. నువ్వు పోకచెక్కతో ఒకటంటే..నేను తలుపుచెక్కతో రెండంటా .. అనే ధోరణి .. రాజకీయాల్లో కామన్. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు రెండు మాటలంటే.. వైసీపీ నేతలు రెచ్చిపోవడం.. ఘాటు విమర్శలు చేయడం మనం చూస్తున్నాం. కానీ, చిత్రంగా మరో కీలక పార్టీ.. బీజేపీ విషయంలో వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నా.. రాష్ట్ర కమలనాథులను వ్యక్తిగతంగా దూషించినా కూడా బీజేపీ నేతలు పెద్దగా స్పందించడం లేదు. ఈ విషయంలో ఎక్కడో ఏదో తేడా కొడుతోందని అంటున్నారు పరిశీలకులు.సాధారణంగా ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర పార్టీకి సారథ్యం వహిస్తున్న సోము వీర్రాజు ఫైర్ బ్రాండ్ అనే విషయం తెలిసిందే. ఆయన ఏ విషయంపైన మాట్లాడినా సంచలనమే. ఎవరినీ ఆయన వదిలి పెట్టరు. గతంలో చంద్రబాబును, కొన్ని కొన్ని సందర్భాల్లో పరోక్షంగా జగన్‌ను కూడా విమర్శించి.. రాజకీయంగా చర్చ కు తెరదీశారు. అయితే, ఇప్పుడు అదే వైసీపీ నుంచి విమర్శలు వస్తుంటే.. మాత్రం మౌనం దాలుస్తున్నారు. ఇటీవల తిరుమల డిక్లరేషన్ వివాదం తెరమీదికి వచ్చింది. అదే సమయంలో రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను కూడా రాష్ట్ర బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వెళ్లిన సీఎం జగన్.. నుంచి డిక్లరేషన్ కోసం పట్టుబట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు రెచ్చిపోయారు. అయితే, ఈ క్రమంలో అనూహ్యంగా రంగంలోకి దిగిన వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి కొడాలి నాని.. అటు మోడీని, ఇటు సోము వీర్రాజును కూడా టార్గెట్ చేశారు. సోము.. ఓ పది మంది వేసుకుని వెళ్లి అమిత్ షాను మార్చమంటే మారుస్తారా ? అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా.. సోము రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాతే.. దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి.. దీనిని బట్టి ఆయనను అనుమానించాల్సి వస్తోందని బాంబు పేల్చారు. నిజానికి ఈ విమర్శలు తేలికగా తీసుకునేందుకు అవకాశం లేదు. బీజేపీ నుంచి ఆశించిన స్తాయిలో నాయకులు స్పందించలేదు. పైగా రాష్ట్ర వైసీపీ కూడా మోడీని ఎవరూ ఏమనవద్దని చెప్పిందే తప్ప.. సోము విషయంలో మాత్రం ఎవరినీ కంట్రోల్ చేయలేదు. అంటే.. అటు బీజేపీ పరంగా సోమును కాపాడే వారు కనిపించకపోగా.. వైసీపీ కూడా ఎవరినీ ఏమీ అనలేదు. ఇదిలావుంటే, తాజాగా .. వైసీపీ కీలక నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డి.. కూడా బీజేపీ నేతలపై దూకుడు ప్రదర్శించారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన పురందేశ్వరిని ఉద్దేశించి.. “ఆమె జాతి నాయకురాలు“ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అమరావతి విషయంలో మాట్లాడిన మాటలకు కౌంటర్‌గా విజయసాయి ఏకంగా ఆమె కూడా కమ్మ సామాజిక వర్గమే కదా.. అనే ధోరణిలో తీవ్ర వ్యాఖ్యలే చేశారని చెప్పాలి.అయినప్పటికీ.. ఈ వ్యాఖ్యలకుకూడా బీజేపీ నుంచి ఆశించిన మేరకు రియాక్షన్ రాలేదు. ఎవరొ ఒకరో ఇద్దరో.. రెండు మాటలు అనేసి మౌనం పాటించారు. ఇక, ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. విమర్శలు చేసే.. సోము అయితే.. ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. మరి ఈ పరిణామం ఏంటి? కేంద్రం నుంచి బీజేపీ నాయకత్వమే.. రాష్ట్ర నేతలను మౌనం పాటించాలని సూచిస్తోందా? వైసీపీ కేంద్రంలోని మోడీ సర్కారుకు సహకరిస్తున్నందున వారితోవివాదాలు, విభేదాలు వద్దని చెబుతోందా? ఏదేమైనా.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామంలో బీజేపీ ఆటలో అరటి పండుగామారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.