YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఓఆర్‌ఆర్ పై అడ‌గ‌డుగునా నిఘా

ఓఆర్‌ఆర్ పై అడ‌గ‌డుగునా నిఘా

ఓఆర్‌ఆర్ పై అడ‌గ‌డుగునా నిఘా
హైద్రాబాద్,  
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహా నగరం పరిధిలో  భద్రత, పౌరుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గారు ఇటీవల హైదరాబాద్‌ మహానగరం పరిధిలో 'పబ్లిక్‌ సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ' అంశంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) పరిధిలోని అన్ని ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి అన్ని శాఖలకు బాధ్యతలు అప్పగిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. అయితే సీసీటీవీల ఏర్పాటు చేయడానికి ఆయా శాఖలతో సమన్వయం చేసే బాధ్యతలను పోలీసుశాఖకు అప్పగించారు. నెల రోజుల వ్యవధిలో ఓఆర్‌ఆర్‌ పరిధిలోని ఇప్పటి వరకు సీసీటీవీ సర్విలెన్స్‌ కెమెరాల ఏర్పాట్లు లేని అన్ని ప్రాంతాల్లో పోలీసు శాఖ సమన్వయంతో అత్యున్నత ప్రమాణాలతో కూడిన సీసీటీవీ సర్విలెన్స్‌ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంబంధిత ప్రభుత్వ శాఖలు, విభాగాలను ఆదేశించింది. ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ), ఫార్మా, సర్విస్‌సెక్టార్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా 'పబ్లిక్‌ సేఫ్టీ మెజర్స్‌'లో భాగంగా భద్రతా ప్రమాణాలను మరింతగా పటిష్టపరచాలనే లక్ష్యంతోనే నిర్ణయించినట్టు ప్రకటించింది. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని జిల్లా కలెక్టర్లు, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ), హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌), సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (ఎస్సీఆర్‌), టీఎస్‌ఆర్టీసీ, తెలంగాణ స్టేట్‌ ఇండిస్టియల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఐఐసీ), హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ (హెచ్‌జీసీఎల్‌), సెంట్రల్‌ పవర్‌ డిస్కమ్‌ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌), మార్కెటింగ్‌, ఇరిగేషన్‌ తదితర సంబంధిత ప్రభుత్వ శాఖలకు, విభాగాలకు ప్రభుత్వం మార్గనిర్దేశనం చేసింది.టీఎస్‌బీపాస్‌లో భాగంగా భవన నిర్మాణ అనుమతుల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటును తప్పనసరిగా చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. అందుకు చర్యలు తీసుకోవాలని డీటీసీపీ, జీహెచ్‌ఎంసీలకు ఆదేశాలు జారీచేసింది. 600చదరపు అడుగులకుపైగా, 600చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం కల్గిన ప్రాంతాలతోపాటు లేఅవుట్లలో కూడ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందేనని సర్కార్‌ తేల్చిచెప్పింది. అన్ని అపార్ట్‌మెంట్లు, షాపుల్లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఔటర్‌రింగ్‌ రోడ్డు పరిధిలోని జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అన్ని మురికివాడల్లోనూ, డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లోనూ బస్తీదవఖానా, పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల ప్రవేశ ద్వారాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. మెట్రో స్టేషన్స్‌, ఎంఎంటీఎస్‌, రైల్వే స్టేషన్లు, టీఎస్‌ఆర్టీసీ బస్‌డిపోలు, బస్సుల్లోనూ, బస్‌బేలు, బస్‌షెల్టర్లు, అన్ని ప్రార్థన మందిరాల ప్రవేశ ద్వారాల్లోనూ అమర్చనున్నారు. చెరువులు, అండర్‌ పాస్‌లు, ఎస్‌ఆర్‌డీపీ, హెచ్‌ఆర్‌డీసీ, సీఆర్‌ఎంపీ, ఇతర రోడ్ల నిర్వహణలో గుర్తించిన ముఖ్యమైన స్తంభాలకు, ఐటీ పార్కు లు, చెత్తను రవాణ చేసే కేంద్రాలు, షెల్టర్‌ హోమ్స్‌, నైట్‌ షెల్టర్లు, సోషల్‌ వెల్పేర్‌ హస్టల్స్‌, వర్కింగ్‌ ఉమెన్‌, పీజీ, ప్రయివేట్‌ రెసిడెన్షి యల్‌ హస్టల్స్‌, పారిశ్రామికవాడల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. పెట్రోలు బంకు లు, ఇంటర్‌సిటీ బస్‌ టర్నినల్స్‌, లాజిస్టిక్స్‌ పార్కులు, రైతు బజార్లు, హోల్‌సేల్‌ మార్కెట్లు, స్ట్రీట్‌వెండింగ్‌ జోన్లు హాకర్‌ జోన్లు, పబ్లిక్‌ టాయిలెట్ల దగ్గరకూ ఏర్పాటు చేయాలని సర్కార్‌ నిర్ణయించింది.

Related Posts