ఇటీవల కాలంలో పేలవమైన ఆటతీరును ప్రదర్శిస్తున్న సురేశ్ రైనా బ్యాట్‌తో అదరగొట్టాడు. సయ్యిద్ ముస్తఖ్ అలీ ట్రోఫీ (ట్వంటీ20 ఫార్మెట్) లో భాగంగా కొల్‌కత్తాలోని ఈడెన్ గార్జెన్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో రైనా రెచ్చిపోయాడు. ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యంవహించిన రైనా...కేవలం 59 బంతుల్లో 126 పరుగులు బాదాడు. 13 బౌండరీలు, 7 సిక్సర్లతో విజృంభించాడు. ట్వంటీ20 క్రికెట్‌లో ఓ భారత ఆటగాడు సాధించిన రెండో అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. 2010లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మురళి విజయ్ 127 పరుగులు సాధించడమే ఇప్పటి వరకు అత్యధిక స్కోరుగా ఉంటోంది. ఈడెన్ గార్డన్‌లో రైనా వీరవిన్యాసాలను మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా నేరుగా ఆస్వాధించాడు. అలాగే విరాట్ కోహ్లీ తర్వాత ట్వంటీ20లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రెండో భారత ఆటగాడిగా, 9వ అంతర్జాతీయ ఆటగాడిగా కూడా రైనా రికార్డు సృష్టించాడు.
226 మ్యాచ్‌లలో కోహ్లీ 7,068 పరుగులు సాధించాడు. ట్వంటీ20 ఫార్మెట్‌లో 10 వేల పరుగుల మైలురాయిని అధిగమించిన ఏకైకా ప్రపంచ ఆటగాడిగా వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. బ్రెండన్ మిక్‌కల్లమ్ 8,769 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. చివరకు గత ఏడాది జనవరిలో టీమిండియా తరఫున ఆడిన సురేశ్ రైనా...జట్టులో తిరిగి చోటు సాధించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఫిట్‌నెస్ లేకపోవడంతో జట్టుకు దూరమైన రైనా...తిరిగి జట్టు చోటు ఆశిస్తున్నట్లు ఇటీవలే తన ఆకాంక్షను వెలిబుచ్చాడు.