విజయవాడ, అక్టోబరు 12,
రాష్ట్రంలో ఎదగాలి.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కలలు కంటున్న రాష్ట్ర బీజేపీ. దీనికి తగిన విధంగా వ్యూహాలు వేస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాజకీయంగా ఓ ఊపు చూపించిన సోము వీర్రాజు.. త్వరలోనే పార్టీని సరైన క్రమంలో నడిపించేలా చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న అసంతృప్తులు, అసంతుష్టులను బుజ్జగించే పనిలో ఉన్న ఆయన వారి కోరిక మేరకు రాష్ట్రంలో బీజేపీని పరుగులు పెట్టించేందుకు త్రిముఖ వ్యూహానికి తెరదీస్తారని తెలుస్తోంది. దీనిని బట్టి…సామాజికంగా అన్ని వర్గాలకు కూడా అవకాశం ఇవ్వడం అనే ఫార్ములాలను అమలు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీలో అసంతృప్తులను తగ్గించేందుకు, పార్టీని పరుగులు పెట్టించేందుకు త్రిముఖ వ్యూహాన్ని అమలు చేసేందుకు పార్టీ నేతలు రెడీ అవుతున్నారని సమాచారం. దీనిలో భాగంగా.. సామాజిక వర్గాల సమీకరణ, జిల్లాలపై ఆయా సామాజిక వర్గాలకు ఉన్న ప్రాధాన్యం వంటి వాటిని ప్రామాణికంగా తీసుకుని పార్టీలో నేతలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలను కాపు సామాజిక వర్గంలోని కీలక నేతలకు అప్పగించడం ద్వారా బీజేపీ పరుగులు పెట్టించడంపై కొన్నాళ్లుగా సోము అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది.వాస్తవానికి ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందే నేత అయినందున ఈ రెండు ప్రాంతాల్లోనూ తానే స్వయంగా ఉండి పార్టీని ముందుకు నడిపించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కమ్మ నేతలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. వీరిలో కీలక నేతలను ఎంపిక చేసే బాధ్యతను వేరే నాయకుడికి ఇప్పటికే అప్పగించారని అంటున్నారు.అదే సమయంలో రెడ్డి వర్గం డామినేషన్ ఉన్న కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో రెడ్డివర్గాన్ని ప్రోత్సహించడం ద్వారా పార్టీని అభివృద్ధి బాటలో నడిపించాలని సోము వీర్రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం అటు వైసీపీలో, ఇటు టీడీపీలో కూడా ఇదే తరహా వ్యూహం అమలవుతోంది. దీంతో తాము కూడా ఇలా అయితేనే పుంజుకునే అవకాశం ఉందని బీజేపీ నేతలు అంటున్నారట. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.