భారతీయ జనతా పార్టీ ఏపీ విభాగానికి నూతన అధ్యక్షుడు ఎవరవుతారు? అనే అంశం ఆసక్తిదాయకంగా మారింది. విశాఖ ఎంపీ హరిబాబు రాజీనామాతో ఈ పదవి ఖాళీ అయ్యింది. నాలుగు సంవత్సరాల నుంచి ఈ పదవిలో కొనసాగిన హరిబాబు రాజీనామా చేసిన విషయం విదితమే. పార్టీ జాతీయాధ్యక్షుడి ఆమోదానికి హరిబాబు రాజీనామా పత్రాన్ని పంపినట్టుగా తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీలో ఒక నియమం ఉంది. అధ్యక్ష పదవిలో ఎవరైనా దీర్ఘకాలం పాటు కొనసాగే సంప్రదాయం లేదు ఆ పార్టీలో. పరిమిత కాలమే ఎవరైనా అధ్యక్ష పదవిలో ఉంటారు. ఆ తర్వాత అవకాశం మరొకరికి దక్కుతుంది.ఇప్పుడు ఏపీ విభాగం విషయంలో కొత్తగా బాధ్యతలు దక్కేదెవరికి? అనేది ఆసక్తిదాయకంగా మారింది. ప్రస్తుతం ఈ జాబితాలో ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మరొకరు మాజీ మంత్రి మాణిక్యాల రావు. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరికి ఏపీ విభాగం అధ్యక్ష పీఠం దక్కుతుందనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట.ఈ సారి ఏపీ విభాగం అధ్యక్ష పదవిని కాపు సామాజికవర్గ నేతకు ఇవ్వాలనేది బీజేపీ అధిష్టానం భావన అని తెలుస్తోంది. అందులో భాగంగా ఈ ఇద్దరు సీనియర్ బీజేపీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో కూడా మాణిక్యాలరావు అనాసక్తిని ప్రదర్శిస్తున్నారని సమాచారం.ఇటీవల ఢిల్లీలో జరిగిన మంత్రాంగంలో పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలను తీసుకోవాలని మాణిక్యాల రావుకు సూచించారట జాతీయ నేతలు. అయితే దానికి ఆయన నిరాకరించినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో.. ఇక మిగిలింది సోము వీర్రాజు మాత్రమే. ప్రస్తుత సమీకరణాల నేపథ్యంలో సోముకే ఏపీ విభాగం అధ్యక్ష పదవి దక్కుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.