న్యూఢిల్లీ, అక్టోబరు 12,
వైఎస్ జగన్ మీద జనాలకు మోజు మరింత పెరిగిందని తాజాగా చేసిన ఒక సర్వే చెబుతోంది. అభిప్రాయ సేకరణగా ఒక జాతీయ సర్వే సంస్థ దీన్ని నిర్వహించింది. వీడీపీ అసోసియేట్స్ ఆర్ అండ్ డీ విభాగం వారు తాజాగా చేసిన ఈ సర్వేలో వైసీపీకి మంచి మార్కులు పడడమే కాదు, గత ఎన్నికల కంటే కూడా మరో మూడు శాతం ఓట్లు ఎక్కువగా పెరిగినట్లుగా అర్ధమవుతోంది. గత ఏడాది ఫలితాల్లో 50 శాతం ఓట్లు వస్తే ఇపుడు మరో మూడు శాతం ఓట్లు వచ్చాయి. ఇదిలా ఉంటే టీడీపీ ఓటు బ్యాంక్ కూడా ఈ ఏడాదిన్నర కాలంలో కాపాడుకోవడం విశేషమే. ఆ పార్టీకి 40 శాతం ఓటింగ్ గత ఎన్నికల్లో రాగా ఈ సర్వేలో అది మరో 0 .89 శాతం పెరిగింది అంటున్నారు.ఇక ఏడాదిన్నరగా జగన్ చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాల ప్రభావం ఈ అభిప్రాయ సేకరణలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అందుకే జగనే తమకు సీఎంగా మళ్లీ రావాలంటూ ఏకంగా 53 శాతం ప్రజలు కోరుకున్నారుట. అదే సమయంలో చంద్రబాబు సీఎం గా రావాలని 40 శాతం ఓటర్లు కోరుకున్నారని అంటున్నారు. అంటే ఒక విధంగా గత ఏడాదిన్నరగా ఈ రెండు పార్టీల మధ్య వచ్చిన ఓట్ల వ్యత్యాసం అలాగే ఉందన్నమాట. అదే సమయంలో తన ఓట్లు జగన్ పెంచుకుంటే, చంద్రబాబు తన ఓటు బ్యాంక్ పడిపోకుండా కాపాడుకోవడం కూడా విశేషంగానే చూడాల్సి ఉంటుంది.ఇక ఏపీలో బీజేపీ జనసేన కూటమి అని హడావుడి చేయడమే తప్ప వైసీపీకి ధీటు అయిన విపక్షంగా జనాలు తెలుగుదేశాన్నే చూస్తున్నారు అని ఈ సర్వే చెబుతోంది. చాలా విషయాల్లో వైసీపీని నిలదీయడంలో టీడీపీ ముందుందని కూడా అంటున్నారు. ప్రతిపక్షంగా సమర్ధంగానే ఆ పార్టీ వ్యవహరిస్తోందని చెప్పడం బట్టి చూస్తూంటే ఏపీలో రాజకీయం ఈ రెండు పార్టీల చేయి దాటి పోదు, పోలేదు అని చెప్పాల్సివస్తోంది. ఇక జగన్ సీఎం గా తన ఇమేజ్ ని పెంచుకోవడమే కాదు, మరింత జనాలకు చేరువ అయ్యారని కూడా అంటున్నారు. అదే సమయంలో పవన్ సీఎం కావాలని కోరుకుంటున్న వారి సంఖ్య కేవలం మూడు శాతం, దగ్గుబాటి పురంధేశ్వరి సీఎం అన్న వారు ఒక్క శాతం మాత్రమే ఉండడంతో ఆటలో అరటిపండుగానే ఈ కూటమి ఉందని అంటున్నారు.ఈ అభిప్రాయ సేకరణ అన్నది ఒక విధంగా వైసీపీకి బూస్టింగ్ లాంటిదే. జగన్ పధకాల పట్ల, ఆయన పాలన పట్ల జనం బాగా సానుకూలంగా ఉన్నారని కూడా అర్ధమవుతోంది. అదే సమయంలో చంద్రబాబుని టీడీపీని దెబ్బతీద్దామని జగన్ ఆయన పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏమంత వర్కౌట్ కావడంలేదని కూడా సర్వే ఫలితాల వల్ల బోధపడుతోంది. అంటే ఏపీలోని జనాలకు జగన్ సీఎం గా కావాలి. అదే విధంగా చంద్రబాబు ప్రతిపక్ష నేతగా బలంగా ఉండాలి అన్నది అభిప్రాయంగా ఉందని అర్ధమవుతోంది. అదే సమయంలో నలభై శాతం ఓట్లు అంటే తక్కువ విషయం కాదు, ఏపీలో మరో మూడున్నరేళ్లలో పరిస్థితులు కాస్తా అటూ ఇటూ మారితే అందుకోవడానికి బాబు రెడీగా ఉన్నారని చెప్పవే ఈ సర్వే సంకేతాలు. ఏది ఏమైనా జగన్ బాబుకు ఇప్పటిదాకా అయితే అందరాని ఎత్తుల్లోనే ఉన్నారని సర్వే స్పష్టంగా చెప్పేసింది