విజయవాడ, అక్టోబరు 13,
జనసేనను బీజేపీ మింగేస్తుందా ? అదేంటి.. ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది ? ఈ సందేహం ఎందుకు ? అని అంటారా ? అక్కడే ఉంది అసలు విషయం. ప్రస్తుతం జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఈ తరహా వ్యూహం ఏదో బీజేపీ అమలు చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ.. రాష్ట్రాలపై కన్నేస్తోంది. రాష్ట్రాల్లోనూ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అధికారమే పరమావధిగా ముందుకు సాగుతోంది. అయితే, రెండు దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీల బలం ఎక్కువగా ఉండడం, కేంద్రంలో అధికారంలోకి రావాలంటే.. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడడం వంటివి తప్పనిసరి అయ్యారు.పైగా కేంద్రం స్వేచ్ఛగా పనిచేయలేక పోతోంది. ఏదైనా నిర్ణయం తీసుకున్నా.. ప్రాంతీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడమో.. లేదా మిత్రపక్షంగా ఉండి.. బయటకు వెళ్లిపోవడమో.. ఇలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు చిన్నా చితకా ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయడమో.. లేదా తమ పార్టీలో కలిపేసుకోవడమో చేయడం ద్వారా బీజేపీ వ్యూహాత్మకంగా ఎదగాలని నిర్ణయించుకు న్నట్టు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ కూడా ప్రాంతీయ పార్టీలను విలీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. ప్రజారాజ్యం దీనికి ప్రధాన ఉదాహరణ. అదే సమయంలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్‌ను కూడా కలుపుకోవాలని అనుకుంది. అయితే, ఇది ముందుకు సాగలేదు. పలు రాష్ట్రాల్లో చిన్న చితకా పార్టీలను కాంగ్రెస్ తనలో విలీనం చేసుకుంది.ఇక, ఇప్పుడు బీజేపీ కూడా ఇదే తరహా వ్యూహంతో ముందుకు సాగుతోంది. చిన్నా చితకా పార్టీలను తనలో విలీనం చేసుకోవడం ప్రధాన అజెండా.. దీనికి ఆయా పార్టీలు అంగీకరించకపోతే.. మిత్రులుగా కొనసాగేలా వారిపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావడం, లూప్ హోల్స్‌ను వెతికి మరీ ఆయా పార్టీలను తన దారిలోకి తెచ్చుకుని తాను చెప్పినట్టు ఆడించడం.. ఇదీ బీజేపీ అమలు చేస్తున్న అజెండా. ఇప్పుడు బిహార్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి ఎల్‌జీపీని నితీష్‌కుమార్‌కు దూరం చేసింది బీజేపీనే. దీంతో తాను కీలకంగా ఎదిగింది.పైగా నితీష్‌తో అంటకాగుతూనే.. రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడిని రెచ్చగొట్టి.. నితీష్ బలాన్ని తగ్గించేలా చేసింది. అంటే.. తనకు బలం లేకపోయినా.. తన వ్యూహంతో ప్రాంతీయ పార్టీల మధ్య చిక్కులు తెచ్చి.. తన మాట వినేలా ఆఖరుకు తనే చక్రం తిప్పేలా చేసుకునేందుకు బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడతో ముందుకు సాగుతోందన్న చర్చలు జాతీయ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి ఏపీలోనూ కనిపిస్తోదని, ఎన్నికలకు ముందు వరకు బీజేపీని తిట్టిన పవన్‌ను తనవైపు తిప్పుకొని తన చెప్పుచేతల్లో పెట్టుకున్న బీజేపీ.. మున్ముందు.. పార్టీని విలీనం చేసుకున్నా .. ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరోవైపు ఏపీలో వైసీపీ బలంగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ అవసరం బీజేపీకి లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ ఎంతో అవసరం ఉంది. ఈ క్రమంలోనే వైసీపీకి దగ్గరవ్వడం లేదా ఆ పార్టీని గ్రిప్‌లోకి తెచ్చుకునే క్రమంలో బీజేపీ జనసేనను త్వరలోనే విలీనం చేసుకునే ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.