విజయవాడ, అక్టోబరు 13,
ఎవరి రాజకీయాలు వారివే. అందులో తప్పులేదు. తమ పార్టీ అభివృద్ధి కోసం పార్టీ అధినేతలు ఎన్ని పాట్లైనా పడవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరెక్కడా ఉండవనే చెప్పాలి. తమిళనాడును తీసుకుంటే అక్కడ అధికార పార్టీ అన్నాడీఎంకే బీజేపీకి మద్దతుగా నిలుస్తుంది. ఇక ప్రతిపక్ష డీఎంకే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగని అధికార అన్నాడీఎంకే పార్టీ అన్ని విషయాలకూ మద్దతు ప్రకటించదు. రాష్ట్ర, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే రెండు పార్టీలూ వ్యవహరిస్తాయి. ప్రజాసమస్యల కోసం తమిళనాడులో అధికార, విపక్షాలు ఏకమైన సందర్భాలు ఉన్నాయి.కానీ ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్ష పార్టీలు మాత్రం బీజేపీకే జైకొడుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలు వారికి అవసరం లేదు. రెండు పార్టీలూ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నాయన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రెండు పార్టీలు నేరుగా బీజేపీతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేదు. కానీ బీజేపీ అడిగినా, అడగకున్నా వీరు ముందుగానే మద్దతు ప్రకటిస్తుండటం చర్చనీయాంశమైంది. తాజాగా వ్యవసాయ బిల్లుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వీరు వ్యతిరేకించడం లేదు.ముందుగా ముఖ్యమంత్రి జగన్ విషయాన్ని తీసుకుంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గారని చెప్పాలి. అంతేకాకుండా ఆయనపై ఉన్న కేసులు కూడా బీజేపీ పట్ల కొంత సానుకూలత పెంచాయన్న ఆరోపణలూ లేకపోలేదు. కేంద్రప్రభుత్వంతో సయోధ్యగా ఉంటేనే నిధులు, వివిధ ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయని జగన్ భావిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ వస్తున్నారు.ఇక చంద్రబాబు విషయంలోకి వెళితే… ఆయన బీజేపీకి ఎందుకు భయపడుతున్నారో అర్ధంకాదు. బీజేపీ లేకుంటే రాజకీయ భవిష్యత్తే లేనట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ముందు బీజేపీని, మోదీని వదిలేసిన చంద్రబాబు ఫలితాల తర్వాత మళ్లీ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని అంశాల్లో బేషరతుగా మద్దతును ప్రకటిస్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకించే సరైన రాజకీయ పక్షం లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసే పరిస్థితి కూడా లేదు. కనీసం తమిళనాడును చూసైనా ఈ రెండు పార్టీలూ బుద్ధి తెచ్చుకోవాలన్న కామెంట్స్ సోషల్ మీడియాలో బలంగా విన్పిస్తున్నాయి.