ముంబై, అక్టోబరు 13,
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం పలు మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని పలువురు ఆరోపణలు గుప్పించారు. రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో దాదాపు 28 రోజుల పాటు జైలు జీవితం గడిపి ఇటీవలే బెయిల్‌పై విడుదలైంది. సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా పక్కింట్లో ఉండే డింపుల్ తవాని అనే మహిళ ఇచ్చిన స్టేట్‌మెంట్ సంచలనం అయింది. జూన్ 13 రాత్రి రియాను సుశాంత్ కార్‌లో డ్రాప్ చేశాడని డింపుల్ తవాని స్టేట్‌మెంట్ ఇచ్చారు. సుశాంత్ మరణించిన ముందు రోజు రాత్రి రియా, సుశాంత్ కలిసి ఉన్నారని చెప్పింది. ఆదివారం సీబీఐ ఎంక్వైరీకి హాజరైన సమయంలో మాట మార్చిందట. రియా, సుశాంత్ కలిసి ఉండడం తను స్వయంగా చూడలేదని, ఎవరో తనకు చెబితే విన్నానని ఆమె యుటర్న్ తీసుకుంది. `మీకు చెప్పిన వ్యక్తిని గుర్తు పడతారా?` అని అడగ్గా.. `ఆ వ్యక్తి సమాచారం బయట పెట్టలేన`ని డింపుల్ సమాధానం ఇచ్చారట. సుశాంత్, రియా కలిసి ఉండడాన్ని ఆ వ్యక్తి ఎప్పుడు, ఎక్కడ చూశారనే విషయాన్ని కూడా డింపుల్ చెప్పలేదు. ఎలా పడితే అలా వ్యాఖ్యలు చేయడం వలన జాతీయ మీడియాలో తప్పకుండా వార్తలు వస్తాయి. ఆధారాలు లేకుండా మాట్లాడితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డింపుల్‌ను హెచ్చరించారు అధికారులు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి ఊహించని విధంగా బెయిల్ లభించింది. సుశాంత్‌కు సంబంధించి డ్రగ్స్, ఆర్థిక వ్యవహారాల్లో అవకతకలపై రియాను సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు. ఈ కేసులో పలుమార్లు కోర్టులు బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన తర్వాత బాంబే హైకోర్టు జైలు నుంచి విడుదలకు సానుకూలంగా స్పందించింది.