YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ విదేశీయం

లిబియాలో బందీలైన శ్రీకాకుళం యువకులకు విముక్తి బాధిత కుటుంబాల్లో ఆనందం

లిబియాలో బందీలైన శ్రీకాకుళం యువకులకు విముక్తి   బాధిత కుటుంబాల్లో ఆనందం

సంతబొమ్మాళి, అక్టోబరు 13
జిల్లాకు చెందిన ముగ్గురు యువకులకు లిబియాలో అగంతకుల చెర నుంచి ఎట్టకేలకు విముక్తి లభించింది. సంతబొమ్మాళి మండలం నౌపడ పంచాయతీ సీతానగరానికి చెందిన బచ్చల జోగారావు, బచ్చల వెంకట్రావు, బొడ్డు దానయ్య సెప్టెంబరు 12న లిబియాలో  అదృశ్యమయ్యారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన మరో నలుగురు యువకులు సైతం కనిపించకుండాపోయారు. వీరంతా స్వస్థలాలకు వచ్చేందుకు కంపెనీ నుంచి ప్రత్యేక వాహనంలో విమానాశ్రయానికి బయలుదేరి... మార్గమధ్యలో అదృశ్యమయ్యారు.
అప్పటి నుంచి వారి క్షేమ సమాచారం తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్పందించారు. గత నెల 23న పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆ తరువాత విదేశాంగ మంత్రి జయశంకర్‌కు ప్రత్యేక విన్నపం చేస్తూ లేఖ రాశారు. అదృశ్యమైన యువకులను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై విదేశాంగ మంత్రి జయశంకర్‌ లిబియాలోని భారత దౌత్య కార్యాలయ అధికారులతో మాట్లాడారు.
అదృశ్యమైన వారి వివరాలు, వారు పనిచేస్తున్న కంపెనీ సమాచారం అందించారు. అక్కడి అధికారులు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ఆరా తీయగా.. మొత్తం ఏడుగురు యువకులను అగంతుకులు కిడ్నాప్‌ చేసినట్టు గుర్తించారు. అగంతుకులతో పలుమార్లు కంపెనీ ప్రతినిధులు, దౌత్య కార్యాలయ అధికారులు చర్చించారు. అవి విజయవంతం కావడంతో ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అగంతుకులు యువకులను విడిచిపెట్టారు. ఈ విషయాన్ని భారత దౌత్య కార్యాలయ అధికారులు ధ్రువీకరించారు.
మరో వారం రోజుల్లో వారందరినీ స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని సమాచారమిచ్చారు.  ఇదే విషయాన్ని ఎంపీ రామ్మోహన్‌నాయుడు బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్‌లో వివరించారు.

Related Posts