హైద్రాబాద్ అక్టోబరు 13,
రాష్ట్రంలో నవంబర్‌లో పాఠశాలలకు విద్యార్థులను అనుమతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులకు కొనసాగుతుండగా, కొన్ని తరగతులకు చెందిన విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేలా వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 15 నుంచి విద్యాసంస్థలను తెరుచుకోవచ్చని, దానిపై తుది నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 5.0 మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో పాఠశాలలకు విద్యార్థులను అనుమతించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై విద్యాశాఖ, సంక్షేమ శాఖలు పరిశీలిస్తున్నాయి. పాఠశాలలను, వసతిగృహాలను తెరవడంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ, సంక్షేమ శాఖల మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్‌లు ఇటీవల మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యా సంస్థలను ఎప్పుడు ప్రారంభించాలి, ఎలా నిర్వహించాలనే విషయంలో విధివిధానాలు రూపొందించాలని మంత్రులు అధికారులను కోరారు. అప్పటివరకు ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్‌లైన్ విద్యా విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. అయితే నవంబర్‌లో పాఠశాలల్లో 9, 10 తరగతులతో పాటు జూనియర్, ఇతర కళాశాలలు తెరవాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న విద్యాశాఖతో పాటు సంక్షేమ శాఖలు సమన్వయం చేసుకుంటూ ఒకే నిబంధనలు రూపొందించనున్నారు.ఆన్‌లైన్ తరగతులను కొనసాగిస్తూనే 9 నుంచి 12వ తరగతులకు చెందిన కొంతమంది విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేలా అనుమతి ఇచ్చే అంశాన్ని విద్యాశాఖ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి రాతపూర్వక అనుమతి తీసుకుని విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. పాఠశాలకు వెళ్లడం లేదా ఆన్‌లైన్ ద్వారా పాఠాలు వినడమనేది విద్యార్థుల అభీష్టానికే వదిలేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బోధన, బోధనేతర ఉద్యోగులు 50 శాతం మంది విధులకు హాజరవుతుండగా, ఇదే విధానాన్ని కొనసాగిస్తూ కొంతమంది విద్యార్థులకు కూడా అనుమతిచ్చే అంశాన్ని విద్యాశాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆన్‌లైన్ తరగతుల్లో సందేహాలు ఉన్న 9, 10 తరగతుల విద్యార్థులతో పాటు ఇంటర్ విద్యార్థులు నేరుగా తమ ఉపాధ్యాయులను కలిసి సందేహాలను నివృత్తి చేసుకునేలా అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ప్రతిరోజు కచ్చితంగా ఉష్ణోగ్రతలు పరిశీలించి వారిని అనుమతి ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రతి పాఠశాలలో థర్మోగన్స్ అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి,ఉపాధ్యాయుడు, ఉద్యోగిలో కోవిడ్ లక్షణాలు కనిపిస్తే తక్షణం వారు సమీపంలోని హెల్త్ సెంటర్‌కు పంపించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. పాఠశాలలకు విద్యార్థులను అనుమతించడంపై ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం వెల్లడించనున్నారు.