విశాఖపట్నం అక్టోబరు 13,
పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుం డం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, నర్సాపూర్ల మధ్య కాకినాడ వద్ద తీరాన్ని దాటింది.గంటకు 17 కిలో మీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొచ్చి కాకినాడ సమీపంలో భూ భాగాన్ని తాకినట్టు అధికారులు తెలిపారు. ఇది ప్రస్తుతం పూర్తిగా భూ భాగంపైకి వచ్చినట్టు ఉపగ్రహం ఛాయాచిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. క్రమంగా బలహీనపడి వాయుగుండం గా, ఆ తదుపరి అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ తెలియజేసింది. ఈరోజు ఉదయం 6.30-7.30 గంటల మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరాన్ని తాకిందని భారత వాతావరణశాఖ తెలిపింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ కేంద్రాలు తీవ్రవాయుగుండం గమనాన్ని పరిశీలించాయని స్పష్టం చేసింది.ప్రస్తుతం ఇది భూ భాగంపైకి రావడంతో పశ్చిమగోదావరి, కృష్ణా, తెలంగాణ జిల్లాల్లో విస్తృత ప్రభావం చూపుతోంది. ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల రాగల ఐదారు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రస్తుతం విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో కొంత మేర వర్ష ప్రభావం తగ్గినట్టు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైనందున ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్ర తీర ప్రాంతం వైపు వెళ్లవద్దని విపత్తు నిర్వహణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి 65 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉందని, ప్రజలు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఏపీ విపత్తులశాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులు, ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్టు చెప్పారు.