బెట్టింగ్, ఫిక్సింగ్ అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా ఆ దందా మాత్రం ఇంకా కోట్లలో నడుస్తున్నది. ఐపీఎల్ పదకొండో సీజన్ మొదలైన పది రోజుల్లోనే కోట్లలో బెట్టింగ్‌లు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ఢిల్లీలో భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లు ఢిల్లీలోని ఓ ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. శనివారం ముంబై, ఢిల్లీ మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహిస్తుండగా వీళ్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.తాము తొలిసారి ఇలా బెట్టింగ్ చేశామని చెబుతున్నారని, అయితే సీజన్ మొదలైన ఏప్రిల్ 7వ తేదీ నుంచే వాళ్లు భారీ ఎత్తున బెట్టింగ్‌కు పాల్పడుతున్నారన్న సమాచారంతో అరెస్ట్ చేశామని ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి యుధ్‌బీర్ సింగ్ చెప్పారు. 11 మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, ఓ టీవీని వాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్, బెంగాల్‌లలోనూ బెట్టింగ్ ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. 2013లో ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ సంచలనం రేపిన విషయం తెలిసిందే. చెన్నై, రాజస్థాన్ టీమ్ ఓనర్లే బెట్టింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై రెండేళ్లు ఆ ఫ్రాంచైజీలపై నిషేధం కూడా విధించారు.