శ్రీవారి దయతో కరోనా కట్టడి కావాలి
- టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి
పూర్ణాహుతితో ముగిసిన షోడశదిన సుందరకాండ పారాయణ దీక్ష
తిరుమలలోకకల్యాణం కోసం కరోనా వ్యాధి కట్టడి కావాలనే సంకల్పంతో షోడశదిన సుందరకాండ పారాయణ దీక్ష చేపట్టామని, దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి దయ వల్ల ఆ సంకల్పం తప్పక నెరవేరాలని ఆశిస్తున్నానని టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి అన్నారు. బుధవారం తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో షోడశదిన సుందరకాండ పారాయణ దీక్ష ముగింపు సందర్భంగా జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఈవో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి ఈవోగా బాధ్యతలు స్వీకరించాక మొదటి వైదిక కార్యక్రమంగా ఈ పూర్ణాహుతిలో పాల్గొనడం దైవానుగ్రహమన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా కరోనా కట్టడికి శాస్త్ర, సాంకేతిక పద్ధతుల్లో కృషి చేశానని, ప్రస్తుతం టిటిడి ఈఓగా వైదిక క్రతువుల ద్వారా వ్యాధిని నివారించేందుకు శ్రీవారి అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ దీక్షా కార్యక్రమానికి రూపకల్పన చేసిన అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా దాతల విరాళంతో నిర్వహించామని, ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 16 రోజుల పాటు ఎంతో దీక్షతో పారాయణం, హోమాలు, జపాలు నిర్వహించిన వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్‌కు, అధ్యాపక బృందానికి, ఉపాసకులకు అభినందనలు తెలియజేశారు.
టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ కరోనా నుంచి మానవాళికి విముక్తి కల్పించేందుకు ఈ దీక్ష చేపట్టామని, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుండి 32 మంది ఉపాసకులను ఆహ్వానించామని తెలిపారు. టిటిడిలో మొట్టమొదటిసారిగా ఈ దీక్షను నిర్వహించామని, ఉపాసకులు ఎంతో నియమనిష్టలతో శ్లోక పారాయణం, హోమాలు నిర్వహించారని వివరించారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోట్లాది మంది భక్తులు వారి ఇళ్లలో ఈ దీక్ష చేపట్టి పారాయణం చేశారని, ఛానల్‌కు వచ్చిన టిఆర్‌పి రేటింగ్ ఇందుకు నిదర్శనమని చెప్పారు. టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి గారి సతీమణి స్వర్ణలత, బోర్డు సభ్యులు కృష్ణమూర్తి వైద్యనాథన్, శేఖర్‌రెడ్డితోపాటు పలువురు దాతలు ఇచ్చిన విరాళాలతో ఈ 16 రోజుల దీక్షా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు.
ముందుగా వేద విజ్ఞాన పీఠంలోని ప్రార్థనా మందిరంలో ప్రిన్సిపాల్ కెఎస్ఎస్.అవధాని ఆధ్వర్యంలో పూర్ణాహుతిలో భాగంగా వశోద్ధార హోమం, పూర్ణపాత్ర విసర్జన, బ్రహ్మ స్థాపన చేపట్టి నారాయణ సూక్తం పఠించారు. అంతకుముందు శ్రీవారి ఆలయం వెనుకవైపు గల వసంత మండపంలో సుందరకాండ శ్లోక పారాయణం ముగిసింది. ముగింపు రోజు శ్రీరామపట్టాభిషేకం శ్లోకాలను పారాయణం చేశారు. వసంత మండపంలో "రాఘవో విజయం దద్యాన్మమ సీతా పతిఃప్రభుః " అనే మహామంత్రం ప్రకారం సుందరకాండలోని మొత్తం 68 సర్గల్లో గల 2,821 శ్లోకాలను 16 మంది సుందరకాండ ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయణం చేశారు. అదేవిధంగా, ధర్మగిరి వేద పాఠశాలలో మరో 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు జప, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం టిటిడి ఈవో, అదనపు ఈవో కలిసి 32 మంది ఉపాసకులను శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదం, సంభావన అందజేశారు. బోర్డు సభ్యులు కృష్ణమూర్తి వైద్యనాథన్ ఉపాసకులకు వస్త్ర బహుమానం అందించారు. ఆ తరువాత శృంగేరి పీఠం తరఫున వారి ప్రతినిధులు విచ్చేసి టిటిడి ఈవో, అదనపు ఈవో, సివిఎస్వోను సన్మానించారు.
--