బొత్స కు మాత్రం నో ప్రమోషన్
విజయనగరం,
క్యాలండర్ వేగంగా కాలాన్ని తినేస్తోంది. చూస్తూండగానే జగన్ ఏడాదిన్నర సీఎంగా అనుభవం సంపాదించేశారు. ఆయన చెప్పినట్లుగానే చూస్తే మరో ఏడాది నాటికి మంత్రి వర్గ విస్తరణ కచ్చితంగా ఉంటుంది. లేకపోతే 151 మందిలో కేవలం పాతిక మందికి మాత్రమే మినిస్టర్ కుర్చీలు అయిదేళ్ళూ అప్పగించి ఎన్నికలకు వెళ్తే చాన్స్ రాని వాళ్ళు పొగపెట్టే ప్రమాదమూ ఉంది. అందుకే జగన్ మార్క్ ఫార్ముల ప్రకారం మరో పాతిక మంది కొలువు తీరాలి. అపుడు ప్రతీ ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవిని జగన్ ఇచ్చినట్లుగా ఉంటుంది. సమ న్యాయం కూడా జరుగుతుంది.నిజానికి జగన్ బొత్స విషయంలో చివరిదాకా ఆలోచించి మంత్రిని చేశారని అంటారు. బొత్సను రాజకీయ అవసరార్ధం తీసుకున్నా ఆయన మీద జగన్ కి పూర్తి నమ్మకం లేదని కూడా చెబుతారు. అందుకే ఆయన వయసులోనూ అనుభవంలోనూ సగానికి సగం అయిన పుష్ప శ్రీవాణికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి బొత్సను మంత్రిగా మాత్రమే చేశారు. ఈ మధ్య జరిగిన మార్పుల్లో ధర్మాన క్రిష్ణ దాస్ కి కూడా డిప్యూటీ సీఎం కిరీటం పెట్టేసారు. ఇంత జరిగినా బొత్స కు మాత్రం నో ప్రమోషన్.ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని వైసీపీలోకి తెచ్చే విషయంలో బొత్స ఆడిన పొలిటికల్ డ్రామా మొత్తం జగన్ కి తెలియడం, ఇక విశాఖ భూ దందాల విషయంలో వచ్చిన ఆరోపణలు, విజయనగరం జిల్లాలో బొత్స హై హ్యాండ్, విజయసాయిరెడ్డిని దాటుకుని ఆయన చేస్తున్న దూకుడు రాజకీయాలూ ఇవన్నీ కూడా జగన్ దృష్టి దాటిపోలేదని కూడా అంటారు. దాంతో ఒకదశలో బొత్సను తప్పించాలని కూడా జగన్ డిసైడ్ అయ్యారని అంటారు. అయితే బీసీ కావడం, సీనియర్ నేతగా ఉండడంతో దాన్ని వాయిదా వేసుకున్నారని కూడా వైసీపీలో ప్రచారంలో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఇపుడు బొత్స మళ్లీ జగన్ కి దగ్గర కావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.ఆ మధ్య వరకూ తాను సీనియర్ ని అని, ఉమ్మడి ఏపీలోనే ముఖ్యమంత్రి రేసులో ఉన్నవాడిని అని బొత్స చెప్పుకునేవారు. పీసీసీ చీఫ్ గా పనిచేసిన తాను ఒకటికి నాలుగు మెట్లు దిగి వైసీపీలో చేరానని పదే పదే అనేవారు. సరే ఇవన్నీ రాజకీయంగా ఎలాంటి సౌండ్ ఇస్తాయన్నది తెలియనంత అమాయకుడు కాదు బొత్స. అందువల్ల ఆయన కావాలనే ఇలా కామెంట్స్ చేస్తూ తన పెద్దరికాన్ని వైసీపీ మరింతగా గుర్తించాలని కోరడంగానే చూడాలి. ఇక బొత్స వైఖరి మీద జగన్ అసహంగా ఉన్నారన్న వార్తలు రావడంతో మళ్ళీ రూట్ మార్చారని అంటున్నారు. ఇపుడు బొత్స జగన్ని తెగ పొగుడుతున్నారు. ఆయన ప్రశంసలు ఏ స్థాయికి వెళ్ళాయంటే జగన్ మంత్రివర్గంలో పనిచేయడం గర్వంగా ఉందని తాజాగా చెప్పుకున్నారు. బీసీల దేవుడు జగన్ అని కీర్తిస్తున్నారు. మరి బొత్స ఆనందాన్ని గర్వాన్ని జగన్ నిలబెడతారా. అయిదేళ్ళ పాటు ఆయన్ని మంత్రిగా కొనసాగిస్తారా. వెయిట్ అండ్ సీ.