రెండు కుటుంబాలు వివాదం
కాకినాడ,
తూర్పుగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతానికి చెందిన ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వ్యక్తిగత విమర్శలు , రాజకీయ విమర్శలు రోజుకో రకంగా ముదురుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఈ నియోజకవర్గంలో కీలకమైన రెండు కుటుంబాలు చక్రం తిప్పుతున్నాయి. అవే వరుపుల, పర్వత ఫ్యామిలీలు. పర్వత ఫ్యామిలీ నుంచి బాపనమ్మ, గుర్రాజు, సుబ్బారావు, చిట్టిబాబు నలుగురు ఎమ్మెల్యేలుగా గతంలో చక్రం తిప్పారు. ఈ కుటుంబం నుంచి ప్రస్తుతం పర్వత పూర్ణ చంద్రప్రసాద్ దూకుడుగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.ఇక, ఇక్కడి నుంచే వరుపుల ఫ్యామిలీ కూడా రాజకీయాలు చేస్తోంది. వరుపుల సుబ్బారావు, జోగిరాజులు టీడీపీలో చక్రం తిప్పుతున్నారు. వరుపుల రాజా టీడీపీలో ఉన్నారు. గత ఏడాది ఎన్నికల్లో పర్వత పూర్ణ చంద్రప్రసాద్ వైసీపీ నుంచి పోటీ చేయగా, టీడీపీ నుంచి వరుపుల రాజా బరిలో దిగారు. అయితే, జగన్ సునామీ నేపథ్యంలో వరుపుల రాజా ఓడిపోయారు. పర్వత పూర్ణ చంద్ర విజయం సాధించారు. అప్పటితో రాజకీయాలు ఆగిపోలేదు. అసలు రాజకీయం అక్కడే మొదలైంది. ఎన్నికల తర్వాత వరుపుల రాజా వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే.. పూర్ణచంద్ర అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ రాజాను చేర్చుకునేందుకు వీల్లేదని పూర్ణ భీష్మించారు. దీంతో చేసేది లేక రాజా టీడీపీలోనే ఉండిపోయారు.ఇక, ఆ తర్వాత ఇరువురి మధ్య మరింతగా రాజకీయం రాజుకుంది. గతంలో డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న వరుపుల రాజా నిధుల దుర్వినియోగం చేసినట్టు పూర్ణ ఆరోపించారు. అది కూడా అసెంబ్లీలోనే ఆరోపించడం, విచారణకు పట్టుబట్టడంతో జగన్ సర్కారు ఈ విషయంలో విచారణకు ఆదేశించింది. రంగంలోకి దిగిన అధికారులు డీసీసీబీలో రూ.16 కోట్ల అక్రమాలు జరిగాయని తేల్చారు. దీంతో పోలీసులు రాజాను అరెస్టు చేసేందుకు రెడీ అయ్యారు. అయితే, ఆయన హైకోర్టుకు వెళ్లి తన అరెస్టుపై స్టే తెచ్చుకున్నారు.ఇక, తనను కేసుల్లో ఇరికించేందుకు పూర్ణ ప్రయత్నించారంటూ.. రాజా వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీనికి పూర్ణ మరింత రెచ్చిపోయారు. దీంతో ఈ వివాదం కాస్తా.. రెండు కుటుంబాల వివాదంగా మారిపోయింది. అయితే, ఇద్దరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు కావడంతో టీడీపీ తరఫున రంగంలోకి దిగిన సీనియర్లు.. నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. అయితే, ఎమ్మెల్యే పర్వత పూర్ణ మాత్రం సయోధ్యకు ససేమిరా అన్నారు. పైగా వైసీపీకి ద్రోహం చేశావంటూ జ్యోతులపై విరుచుకుపడ్డారు.దీంతో సయోధ్య ఆదిలోనే తెగిపోయింది. ఈ పరిణామాలతో నియోజకవర్గం నిత్యం రాజకీయ కక్షలతో అట్టుడుకుతోంది. ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. మొత్తానికి గతంలో ఎంతో ఘన కీర్తి ఉన్న ఈ రెండు కుటుంబాలు ఇలా వ్యక్తిగత దాడులకు, రాజకీయ వేధింపులకు దిగడాన్ని ఓ వర్గం ప్రజలు హర్షించడం లేదని అంటున్నారు పరిశీలకులు. చివరికి ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో ? చూడాలి. ఏదేమైనా రెండు పార్టీల అధిష్టానాలు జోక్యం చేసుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాదని అంటున్నారు ప్రజలు. చూడాలి ఏం చేస్తారో.