సమర భేరికి సిద్ధంగా ఉండాలి: దేశ బలగాలకు చైనా అధ్యక్షుడుపిలుపు
బీజింగ్
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. సమర భేరికి సిద్ధంగా ఉండాలంటూ తమ దేశ బలగాలకు పిలుపునిచ్చారు. దక్షిణ ప్రావిన్సు గాంగ్‌డాంగ్‌లో ఉన్న ఓ మిలిటరీ బేస్‌ను ఆయన విజిట్ చేశారు. ఈ నేపథ్యంలో సైనిక బలగాలతో మాట్లాడుతూ.. తమ శక్తిని, యుక్తిని యుద్ధంపై కేంద్రీకరించే విధంగా ఉండాలన్నారు. చాజూ సిటీలో ఉన్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మెరైన్ కార్ప్స్ దళాలను అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తనిఖీ చేశారు. ఎప్పడూ హై అలర్ట్‌లో ఉండాలంటూ ఆయన సైనికులకు ఉపదేశించారు. సైనికులెప్పుడూ నిత్యం విశ్వసనీయంగా, స్వచ్ఛంగా, నమ్మకంగా ఉండాలన్నారు. షెన్‌జెన్ స్పెషల్ ఎకానమిక్ జోన్ 40వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన గాంగ్‌డాంగ్ వెళ్లారు. అమెరికా, భారత్‌తో డ్రాగన్ దేశం ఇటీవల ఘర్షణలకు దిగుతున్న నేపథ్యంలో జీ జిన్‌పింగ్ ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. డ్రాగన్ దేశంతో కయ్యానికి దిగుతున్న ట్రంప్ సర్కార్.. తైవాన్‌కు మూడు అడ్వాన్స్‌డ్ వెపన్ సిస్టమ్స్‌ను అమ్మేందుకు సిద్ధమైంది. అమెరికా కాంగ్రెస్‌కు ఈ విషయాన్ని చేరవేసినట్లు వైట్‌హౌజ్ పేర్కొన్నది. హై మొబిలిటీ ఆర్టిల్లరీ రాకెట్ సిస్టమ్‌ను తైవాన్‌కు అమ్మేందుకు అమెరికా సిద్ధపడింది. అయితే తైవాన్‌కు ఆయుధాలు అమ్మే ప్రక్రియను అమెరికా తక్షణమే రద్దు చేసుకోవాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ పేర్కొన్నారు.