YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మరుదమలై - తమిళనాడు

మరుదమలై - తమిళనాడు

షణ్ముఖుని హస్తాలలో  ఎన్నో ఆయుధాలు వున్నప్పటికి వేలాయుధం  అనే శూలమే చాలా   విశిష్టమైనది.  దైవీకమైన  ఆయుధాలలో  విశిష్టత కలిగి పూజలు జరిపేది యీ వేలాయుధమనే  శూలానికి మాత్రమే.  ప్రాచీనకాలంనుండే శూలానికి పూజలు జరిపే ఆచారమున్నట్లు,
శిలప్పధికారం అనే  తమిళగ్రంధం  తెలుపుతోంది.  వెట్రివేల్, వీరవేల్, శక్తి వేల్,సౌందర్య వేల్, జ్ఞానవేల్,  అనే  పలు నామాలతో  ఈ శూలాన్ని కీర్తించడం అనేక గ్రంధాలలో చూస్తాము.  వేల్ పూజకు పైన  వేరే పూజలు యేమీ లేవు.  శూల చిహ్నాలను దేహం మీద ధరించడం , మనసార వేల్, వేల్ అని స్మరించడమే  శూలాన్ని పూజించడంలో  ముఖ్యం.  శూలాన్ని పూజించిన వారికి ఏ రకమైన సమస్యలు  వుండవని విశ్వాసం. 
కుమారస్వామి పరమభక్తుడైన అరుణగిరినాదర్  స్తుతించిన  స్తోత్రాలలో 'కందన్ అలంకారం '  అనే స్తోత్రాలలో  వేల్  (శూలం)  విశిష్టతను  వివరించారు. సకల బంధువులు  వదలి వేసిన సమయంలో, కుమారస్వామికి  ఆయన వాహనమైన మయూరం, ఆయన ఆయుధం శూలం మాత్రమే  తోడుగా వున్నాయని వివరించారు.  వేల్( శూలం) జ్ఞానానికి చిహ్నం. ఆ శూలాన్ని ధరించిన  కుమారస్వామిని జ్ఞాన వేల్ అని కీర్తిస్తారు.  వేల్ (శూలం)  ని పూజిస్తే  జ్ఞానాభివృధ్ధి  కలుగుతుంది.  కుమారగురుబర స్వామి అనే  కుమారస్వామి భక్తుడు  చాలా కాలం మాటలు రాని మూగవానిగా వుండి పోయాడు.  తిరుచెందూరు కుమారస్వామిని భక్తి శ్రధ్ధలతో ప్రార్ధిస్తూ ఆ దేవుడినే నమ్ముకుని వుండిపోయాడు. ఒకనాడు  కుమారస్వామి కుమారగురుబరుని  మొరనాలకించి దర్శనమిచ్చాడు.  "గురుబరా! నీకు మాటాడేశక్తి తో పాటూ సకల శాస్త్రాలలో పాండిత్యాన్ని కూడా  వరంగా ఇస్తున్నాను. " అని గురుబరుని నాలిక మీద జ్ఞాన వేల్(శూలం) తో  వ్రాశాడు. కుమారస్వామి
అనుగ్రహంతో, గురుబరుడు  'కందన్ కలివెణ్బా' అని స్తుతిస్తూ పాడాడు.  మాయామయంగా వుండే క్రౌంచ పర్వతాన్ని చిన్నాభిన్నం  చేసిన శూలాన్ని పూజించిన వారికి దుష్ట శక్తులు , దుష్ట జంతువులు , దీర్ఘవ్యాధులు, నవగ్రహ దోషాల బాధలు తొలగిపోతాయని ఆది శంకరాచార్యుల వారు తెలిపారు.
శూలబంధనం..
చిదంబరంలో శివగంగై  పుష్కరిణి  మండపంలో  కుమారస్వామి బంధనం అనే మంత్రం  చిత్రీకరించబడి వున్నది.  శతృవులు వుండే  ప్రదేశాలకు వెళ్ళే ముందు కవచం ధరించి వెళ్ళడం యుధ్ధ విధి.  ఆ విధంగా  మంత్రం రక్షణ బంధనంగా వున్న వేల్(శూలం) మనకి  రక్షణ నిచ్చి విజయం చేకూరుస్తుందని  ఐహీకం.
వేల్ వృత్తం..
తమిళంలోను, సంస్కృతంలోను  పండితుడైన  అరుణగిరినాదర్  15 వ శతాబ్దంలో కుమారస్వామిని  వేల్ వృత్తం , వేల్ వగుప్  అనే  స్తోత్రాలతో కీర్తించారు.  ఖ్యాతిగాంచిన వేల్(శూలం)  కి    ఒక  ప్రత్యేక ఆలయం కోవై  మరుదమలై కొండ చరియలలో  వున్నది.  శూల కోట,  ధ్యాన మండపం అని పిలుస్తారు.
ఆ మరుదమలై స్ధల చరిత్ర తెలుసుకుందాం..
కోయంబత్తూర్ లోని కుమారస్వామి భక్త బృందం  1986  మే  1వ తేదీ న  మరుదమలై మురుగన్ కి పూజలు  చేసి  వేయి మందికి  అన్నదానం చేయడం ఆచారంగా  పెట్టుకున్నారు.  1997  లో ఈ బృందంలో వున్న ఒక భక్తునికి స్వప్నం లో వేల్(శూలం) దర్శనమిచ్చింది.  ఇది తెలుసుకున్న భక్త బృందం  2 .1/4 అడుగుల వెండి శూలం  చేయించి దానిని  తిరుచెందూరుకి తీసుకుని వెళ్ళి పూజలు అభిషేకాలు  చేయించి తీసుకు వచ్చారు.  మరుదమలై కుమారస్వామి  కి జరిపే విశేష పూజ ఉత్సవాలలో  యీ వేల్ ని అలంకరించి  ఊరేగిస్తారు.  ఆ భక్త బృందం ఏకగ్రీవంగా తీర్మానం చేసి శూలానికి  ఒక ప్రత్యేక ఆలయం నిర్మించాలని సంకల్పించినది.  4..6..2005 లో  ఆరంభించి  కుమారస్వామి అనుగ్రహంతో  6..11..2008 ఆలయ ని‌ర్మాణం ముగించి  కుంభాభిషేకం వైభవంగా జరిపారు.  6..3/4 ఎత్తు కలిగి సుందరమైన  శిల్పకళతో అలరారుతున్న  వేలాయుధం గర్భగుడిలో ప్రతిష్టించబడినది.  శూలం యొక్క  మధ్య  భాగమున పంచభూత చక్రాలు  చెక్కబడినవి.  గర్భగుడి కి ముందున్న మండపం ఆరుకోణాలుగా  కమారస్వామి ఆరు అక్షరాల మంత్రం  'శరవణ భవ'  చిహ్నంగా నిర్మించబడినది.  ఈ మండంపంలో ఆశీనులై  శూలాయుధాన్ని ధ్యానించి  భక్తులు, నూతన  ఉత్సాహాన్ని  ప్రశాంతతని పొందుతున్నారు.  ఈ ఆలయంలో  మంగళవారం, శుక్రవారం, ఆదివారం ,షష్టి, కృత్తికా నక్షత్రంనాడు, ప్రత్యేక అభిషేక ఆరాధనలు జరుగుతాయి.  శూలాన్ని పూజించిన వారికి సర్వ శుభాలు లభిస్తాయి.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts