కేబినెట్ బెర్తు కోసం ప్రణాళికలు
కడప,
ఏడాదిలోగానే జగన్ కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించేందుకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఆశావహులు అందరూ ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. కొందరు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇంకొందరు.. లోపాయికారీగా.. కార్యకర్తలను రెచ్చగొట్టి.. తమ నేతకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే! అనే డిమాండ్లు చేయిస్తున్నారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి పెద్ద ఎత్తున `కాబోయే మంత్రి` అంటూ ప్రచారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కడప జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలోనూ ఈ తరహా ప్రచారం జరుగుతోంది.ఈ నియోజకవర్గంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు కోరుముట్ల శ్రీనివాసులు. ఎస్సీ నాయకుడు, పైగా జగన్‌కు అత్యంత సన్నిహితుడు, విధేయుడు.. కావడం పార్టీలోనూ బలమైన వాయిస్ వినిపించడంతో ఆయనకు త్వరలోనే జరగబోయే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో బెర్త్ ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. కోరుముట్ల శ్రీనివాసులు గత నాలుగు ఎన్నికల్లోనూ ఓటమి లేకుండా గెలుస్తున్నారు. 2019లోనే ఆయనకు మంత్రి పదవి వస్తుందన్న సంతోషంగా అమరావతికి వచ్చేశారు.అయితే చివర్లో సమీకరణలు మారిపోయాయి. ఐదుగురు ఎస్సీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినా జగన్ సొంత జిల్లాలో ఈక్వేషన్లను బ్యాలెన్స్ చేసే క్రమంలోకోరుముట్ల శ్రీనివాసులును పక్కన పెట్టారు. అయితే ఈ సారి ఆయనకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం ఆయన అనుచరుల్లో జోరుగా జరుగుతోంది. అది కూడా విద్యాశాఖనే ఇచ్చే అవకాశం ఉందని.. ప్రస్తుతం ఈ శాఖను ఎస్సీ వర్గానికి చెందిన ఆదిమూలపు సురేష్ చూస్తున్నారు. దీంతో వచ్చే పునర్వ్యవస్థీకరణలో ఆయనను తప్పించి కోరుముట్ల శ్రీనివాసులుకు అప్పగిస్తారంటూ.. ఎమ్మెల్యే అనుచర వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.ఎక్కడ విన్నా..ఎవరిని కదిపినా.. కోరుముట్ల శ్రీనివాసులు మంత్రి అవుతారనే టాక్ కోడూరులో విస్తృతంగా వినిపిస్తోంది. అయితే,దీనిపై ఎమ్మెల్యే మాత్రం మౌనంగా ఉన్నారు. మీడియా ఆయనను కదిలించినా.. అభిమానులు ఏదో ప్రచారం చేసుకుంటున్నారు. వారి అభిమానం వారిది. కాదని ఎలా చెబుతాను. ఏం జరిగినా.. జగన్ ఇష్టం! అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, జరుగుతున్న ప్రచారం మొత్తం ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు కనుసన్నల్లోనే జరుగుతోందని.. దీని వెనుక ఆయన బంధువుల ప్రమేయం కూడా ఉందని.. అంటున్నారు.నిజానికి నాలుగు సార్లు ఇక్కడ నుంచి విజయం సాధించిన కోరుముట్ల శ్రీనివాసులు ఒకసారి కాంగ్రెస్ టికెట్‌పైనా.. మూడు సార్లు వైసీపీ టికెట్‌పైనా విజయం సాధించారు. కాబట్టి ఆయన మంత్రి పదవికి అర్హుడేనని పార్టీలో కొందరు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఈ పరిణామాలు చూస్తే.. వచ్చే మంత్రి వర్గ మార్పుల్లో చోటు కోసం కొరుముట్లతో పాటు చాలా మంది ఆశావాహ నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నారనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి.