కాంట్రావర్శీలో కత్తి కార్తీక
మెదక్,
దుబ్బాక నియోజకవర్గం నుంచి ఇండిపెంటెండ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కత్తి కార్తీక, ఆమె అనుచరులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదయింది. ఆమెతో పాటు ఆమె అనుచరులు శ్రీధర్ గోపిశెట్టి, నువ్వాల శివరామ్ ప్రసాద్, తానేరి భీమ్‌సేన్, లాల జాగ్రూత్ లాల్, అందె మురళీకృష్ణ, లాల మోహన్ సంతోష్ లాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్‌కు చెందిన పచ్చిపాల దొరస్వామి టచ్‌స్టోన్ ప్రాపర్టీ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్. మెదక్ జిల్లా, అమీన్‌పూర్ గ్రామంలోని సర్వే నంబర్ 322, 323, 324, 329లోని 52.29 ఎకరాల భూమిని టచ్‌స్టోన్ ప్రాపర్టీ డెవలపర్స్‌కు విక్రయించేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు కత్తీ కార్తీక ఆమె అనుచరులకు కోటి రూపాయలు ఇచ్చారు.వీరి మధ్య ఏప్రిల్ 2020లో ఒప్పందం కుదిరింది. తామకు సిసిఎల్‌లో పనిచేస్తున్న అధికారులతో, రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని భూమిని యజమానితో మాట్లాడి ఇప్పిస్తామని చెప్పడంతో బాధితుడు డబ్బులు ఇచ్చాడు. భూమికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని చెప్పారు. బాధితుడి స్నేహితుడు శ్రీధర్ గోపిశెట్టి ఎంఓయూ చేసుకోవాలని, లాలామోహన్ సంతోష్ సిసిఎల్‌ఎలో పనిచేస్తున్నాడని, మధ్యవర్తులు కూడా భూమికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తారని, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ నుంచి ఎన్‌ఓసి తీసుకువస్తారని చెప్పాడు. భూమి యజమాని తనకు కాలేజీమెట్ అని నమ్మి డబ్బులు డిపాజిట్ చేయాల్సిందిగా కోరడంతో కోటి రూపాయలకు కార్తీక గ్రూప్ అండ్ మధ్యవర్తుల పేరుమీద రిఫండబుల్ డిపాజిట్ చేయించా డు.ఇరు పక్షాల వారు అగ్రిమెంట్ చేసుకోగానే ఏడు రోజుల్లో డబ్బులు తిరిగి ఇస్తారని చెప్పడంతో బాధితుడు నమ్మి డబ్బులు డిపాజిట్ చేశాడు. భూమి యజమానులను రూ.35కోట్లకు విక్రయించేందుకు ఒప్పించామని చెప్పారు. ఆర్కిటెక్చర్ ఫీజు, అగ్రిమెంట్ చేసినందుకు శ్రీధర్ రూ.10లక్షలు తీసుకున్నాడు. నిందితులు అందరూ కలిసి కోటి రూపాయలను మే4న, 2020లో విత్‌డ్రా చేశారు. బాధితుడు భూమి యజమానులు సిస్‌లా రమేష్, మిగతా వారిని కలవడంతో తాము నిజమైన యజమానులమని, ఎవరినీ మధ్యవర్తిత్వంకోసం సంప్రదించ లేదని, ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని చెప్పారు.