అమరావతి తరలింపు అంత ఈజీ కాదా
విజయవాడ,
రాజధాని అమరావతి అంశంపై విచారణ హైకోర్టు ప్రారంభించింది. అయితే ఇప్పట్లో ఈ అంశం తెగేటట్లు కనపడటం లేదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అనుకున్న విధంగా విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు ఇప్పట్లో సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు అంశాలపై హైకోర్టులో విచారణ ప్రారంభమయింది. అంతవరకూ బాగానే ఉన్నా లెక్కకు మించి పిటీషన్లు పడటంతో అనివార్యంగా సమయం పట్టే అవకాశముంది.ఏడాది జనవరి నెలలో వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. శాసనమండలిలో ఒకసారి తిరస్కరిస్తే మరోసారి మళ్లీ ప్రవేశపెట్టి గవర్నర్ చేత ఆర్డినెన్స్ పై సంతకాలు చేయించేశారు. దీంతో పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు చట్ట రూపాన్ని సంతరించుకున్నట్లయింది. అయితే న్యాయపరమైన చిక్కులే ఇప్పుడు మూడు రాజధానుల ఏర్పాటు ఆలస్యమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.నిజానికి జగన్ విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుకు మూడు ముహూర్తాలను నిర్ణయించుకున్నారు. ఆఖరు ముహూర్తం దసరాకు. ఇది సాధ్యమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. దాదాపు వందకుపైగా పిటీషన్లు, అనుబంధ పిటీషన్లను న్యాయస్థానం విచారించాల్సి ఉంది. దీనికి తోడు తమ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటే పరిపాలన రాజధాని, న్యాయరాజధాని ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర, సీమ ప్రాంతం నుంచి ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా మరికొన్ని పిటీషన్లు వేశారు.ఇలా వరసగా పిటీషన్లు పడుతుండటంతో రాజధాని అమరావతి అంశం ఇప్పట్లో తేలేలా కన్పించడం లేదు. హైకోర్టు స్టే ఉత్తర్వులు కూడా తొలగించకపోవడంతో మరోసారి సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించక మానదు. ఇలా కోర్టులు చుట్టూ కాలక్షేపం చేయాల్సి వస్తుందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అమరావతి అంశం ఇప్పట్లో తెగేలా కన్పించడం లేదన్నది వాస్తవం.