జగన్ అండ్ కో ప్లాన్ సక్సెస్ అవుతుందా..?
న్యూఢిల్లీ
జాతీయ స్థాయిలో ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పేరు మారుమోగుతుంది. ఓ సున్నితమైన వ్యవహారంలో తలదూర్చి మరీ గెలికేశారు జగన్. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సుప్రీం కోర్టు జడ్జీనే టార్గెట్ చేస్తూ, సిజేఐకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశాడు. ఇప్పుడు ఆ లేఖ ఏపీలోనే కాక దేశ రాజకీయాలు, న్యాయ వ్యవస్థల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. జగన్ లేఖకు సీజేఐ ఎలా స్పందిస్తారనే అంశం పక్కన పెడితే అసలు జగన్ న్యాయ వ్యవస్థను ఢీకొనేందుకు సిద్ధమవ్వడమే ఓ సాహసంగా చెప్పాలి. జగన్ లేఖపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలు, న్యాయ వ్యవస్థలో వర్గాలుగా విడిపోయి చర్చోపచర్చలు జరుపుతున్నారు. అయితే జగన్ సాహసం వెనుక పెద్ద కథే ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ లేఖ ద్వారా ఏం జరిగినా మనకే మేలవుతుందని జగన్ బలంగా నమ్మిన తరువాతనే ఆ లేఖాస్త్రాన్ని వదిలినట్లు వైసీపీలో చర్చ సాగుతుంది. జగన్మోహన్ రెడ్డిపై కేసులున్నాయి. ఇప్పటికే ఆయన ప్రతీ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజవుతూ వస్తున్నాయి. అయితే ఇటీవల సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ధీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, ఆర్థిక నేరాలు, ఇతర కేసులకు సంబంధించి ప్రత్యేక విచారణ చేసి పూర్తిచేయాలని హైకోర్టులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో వైఎస్ జగన్ కేసులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు పరిధిలో ఈ కేసుల వాదనలు సాగుతున్నాయి. వేగంగా విచారణ జరిపితే జగన్‌కు ఉచ్చుబిగుసుకోవటం ఖాయం. మరోవైపు అమరావతి రాజధాని ప్రతీ విషయంలోనూ ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురవుతుంది. ఈ కేసుల్లో చంద్రబాబు లాబీయింగ్ బాగా పనిచేస్తుందని జగన్ అండ్ కో ఇప్పటికే వాదిస్తూ వస్తోంది. ఇప్పటికే ఈ అంశాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లింది. ఇదే సమయంలో జగన్ సుప్రీంకోర్టు జడ్జిపై లేఖాస్త్రాన్ని సంధించాడు. దీనివెనుక రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటిది.. అమరావతి విషయంలో హైకోర్టు తీర్పులను కట్టడి చేయడానికి ఈ లేఖ ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నారట. ఇప్పటికే చంద్రబాబు వల్లే ఇలాంటి తీర్పులు వస్తున్నాయని ప్రచారం చేస్తున్న వైసీపీ.. ఏకంగా సుప్రీంకోర్టు జడ్పీమీదనే లేఖాస్త్రం సంధించడం ద్వారా ప్రజల్లో ఈ వాదనను బలంగా రుద్దవచ్చని, అదే సమయంలో హైకోర్టు తీర్పులకు కూడా ఈ లేఖ ప్రభావం పడుతుందని ఇలా చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సుప్రీం తీర్పుతో జగన్‌పై ఉన్న ఆర్థిక నేరం కేసులు విచారణలో ఎలాంటి తీర్పు వచ్చినా జగన్‌ను కావాలనే ఇరికించారనే వాదన ప్రజల్లో ఉండేలా ముందుగానే జగన్ ఈ లేఖను రాసినట్లు ప్రచారం సాగుతుంది. ఊహించని రీతిలో కేసులు వేగంగా విచారణ పూర్తయ్యి ఒకవేళ జగన్ నేరస్తుడుగా రుజువైతే.. ప్రజల్లో జగన్ నేరస్తుడు అనే ముద్ర లేకుండా చేయడంతో పాటు మరింత సానుభూతి వచ్చేలా జగన్ అండ్ కో ఈ ప్లాన్‌ను అమలు చేసినట్లు ప్రచారం సాగుతుంది. ఒకవేళ జగన్ నేరస్తుడుగా రుజువై జైలుకు వెళ్లినా.. ప్రజల్లో మాత్రం జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడం వల్లనే అతన్ని కేసుల్లో నేరస్తుడుగా తేల్చారని ప్రజల్లో బలమైన వాదన వెళ్లేలా ఈ లేఖ ఉపయోగపడుతుందని, అందుకే జగన్ ఈ పంథాను ఎంచుకున్నారని వైసీపీలోని పలువురు నేతలు గుసగుసలాడుకోవటం కనిపిస్తోంది. మొత్తానికి సుప్రీంకోర్టు జడ్జిపై సీజేఐకే ఫిర్యాదు చేయడం ద్వారా.. ఏం జరిగినా ప్రజల్లో జగన్‌పై సానుభూతి పెరుగుతుందని, మరోసారి అధికారంలోకి వైసీపీ రావటం ఖాయంగా ఉంటుందనే మాస్టర్ ప్లాన్‌ను జగన్ అండ్ కో అమలు చేసినట్లు ప్రచారం సాగుతుంది. మరి జగన్ అండ్ కో ప్లాన్ సక్సెస్ అవుతుందా..? బెడిసి కొడుతుందా వేచి చూడాల్సిందే